Kurnool.. పాలేరువాగుపై బ్రిడ్జి నిర్మించాలి: సీపీఐ నేతలు
జిల్లాలోని మహానంది సమీపంలోని అగ్రికల్చర్ కాలేజీ వద్ద ఉన్న పాలేరు వాగు వద్ద బ్రిడ్జి నిర్మించాలని సీపీఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు ఉప్పొంగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. సోమవారం పాలేరువాగు ప్రాంతాన్ని సీపీఐ కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.బాబా, ఫక్రుద్దీన్ మండల కార్యదర్శి ఆర్.సామేలు, రైతు సంఘం నాయకులు, పంచాయతీ వార్డు మెంబర్ సందర్శించారు.
వాగు వల్ల టూరిస్టులు, స్థానిక ప్రజలు అటు నుంచి ఇటు పోవడానికి వీలులేకుండా ఉండబోదని, రాకపోకలు నిలిచిపోతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయమై ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలో సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రిడ్జి కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఇకపోతే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో, రాష్ట్రంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటి వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.