Nalgonda.. ఉద్యమాలతోనే చట్టాల రద్దు.. సీపీఎం నేత జూలకంటి
కార్మికులు ఐక్యంగా ఉండి బలమైన క్రియాశీల ఉద్యమాలు చేసినప్పుడే కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దవుతాయని సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో సీపీఎం నేతలు మిర్యాలగూడలో కేంద్రప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్టాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరక చట్టాలను తీసుకొస్తున్నదని చెప్పారు. సామాన్యుడి నడ్డీ విరచడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు.
కేంద్రం కార్మికులు పోరాడి తెచ్చుకున్న పనిగంటలను పెంచిందని పేర్కొన్నారు. కేంద్రం పని గంటలను ఎనిమిది గంటల నుంచి 12 గంటలకు మార్చిందని వివరించారు. ఇకపోతే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకుగాను కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో జూలకంటి రంగారెడ్డి, సీపీఎం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.