దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై దేశద్రోహం కేసు.. కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్..?
Haryana Farmers దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తోంది. ఇప్పటికీ దేశద్రోహం కేసులు నమోదవుతుండడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు అలా అభిప్రాయపడిందో లేదో.. హర్యానాలో దేశద్రోహం కేసు ఫైల్ అయ్యింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వంద మంది రైతులపై అభియోగం మోపారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానాలో బిజెపి ప్రభుత్వం దేశద్రోహం, హత్యాయత్నం కేసులు బనాయించింది. ఈ నెల 11న సిర్సాలోని హర్యానా డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వాను రైతులు అడ్డుకున్నారు.
బిజెపి నాయకుల సామాజిక బహిష్కరణలో భాగంగానే వారు ఈ చర్య తీసుకున్నారు. దీంతో వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సెక్షన్ 124 ఎ (దేశద్రోహం)తో పాటు 307 (హత్యాయత్నం), 186 (ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వర్తించడంలో ప్రభుత్వోద్యోగులను అడ్డుకోవడం) వంటి క్రూరమైన సెక్షన్ల కింద కేసులు బనాయించారు. రైతు నేతలు హర్ చరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. దీనిని సంయుక్త్ కిసాన్ మోర్చ ఖండించింది. తప్పుడు అభియోగాలు నమోదు చేశారని.. కోర్టు ధిక్కరణ పాల్పడ్డారని చెప్పారు. రైతు నేతలు సహా వంద మంది అన్నదాతలపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపింది.
ఆరు నెలలుగా రైతు ఉద్యమం.. Haryana Farmers
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆరు నెలల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆందోళన చేస్తున్న రైతులపై దేశద్రోహం కేసు నమోదుచేయడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) తప్పుబట్టింది. ఇవన్నీ నిరాధారమైన.. పనికిమాలిన.. ఉద్దేశపూర్వక ఆరోపణలని మండిపడింది. ఇలాంటి చర్యలు తీసుకొని రైతులను రెచ్చగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొంది. దేశద్రోహ కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం రైతులను రెచ్చగొడుతోంది. వాహనం విండ్‌స్క్రీన్ పగిలితే దేశద్రోహం, హత్య కేసులు ఎలా పెడతారు? అని ప్రశ్నించింది. రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేయడం దేశద్రోహ నేరమా? వారిపై కేసులు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. బిజెపి, జెజెపి, చట్టాలకు మద్దతు ఇచ్చే స్వతంత్రులతో సహా అందరు శాసన సభ్యులను శాంతియుతంగా బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. రైతు ఉద్యమ నేతలు హర్‌చరణ్ సింగ్, ప్రహ్లాద్ సింగ్ సహా దాదాపు 100 మంది రైతులపై తప్పుడు కేసులు బనాయించారు.. హర్యానాలోని రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా భయానక వ్యూహాలను ప్రయోగించడం కొనసాగిస్తోందని ఎస్కేఎం విమర్శించింది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినా..
హర్యానా రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ సూచనల మేరకు.. రైతులు, రైతు నాయకులపై పోలీసులు చేసిన తప్పుడు, దేశద్రోహ ఆరోపణలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. తాజా కేసును కోర్టులో సవాల్ చేయడానికి రైతులు, రైతు నాయకులందరికీ సంయుక్త కిసాన్ మోర్చా సహాయం చేస్తుందని పేర్కొంది. మరోవైపు,దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే రైతులపై దేశ ద్రోహం కేసు విషయం వెలుగులోకి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుందని,బ్రిటిష్ కాలం నాటి చట్టం ఇంకా అవసరమా అని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ చట్టం దుర్వినియోగం కాకూడదు అన్నదే తమ ఉద్దేశమని సీజేఐ వ్యాఖ్యానించారు.