K. Chandrashekar Rao : సొంత భూమిలో ఇల్లు కట్టుకునే వారికి సీఎం కేసీఆర్ శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. ఎవరికి వారు సొంత భూమిలో ఇల్లు కట్టుకునేందుకుగాను త్వరలో పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 1,000 లేదా 1,500 మందికి ఈ పథకం కింద అవకాశం ఇస్తామని వివరించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంగా ఈ హామీ ఇచ్చామని, అయితే, కరోనా మహమ్మారి వల్ల పథకం ప్రారంభించడం ఆలస్యమైందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీ అవినీతితో పాటు అవకతవకలు జరిగాయని విమర్శించారు. ఇప్పుడు అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ‘దళిత బంధు’ పథకం ప్రారంభించిన సంగతి అందరికీ విదితమే. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు.