Balineni : బాలినేనికి బై చెబుతారా.. కొనసాగింపు కష్టమేనా..?
Balineni : బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు శాసన సభ్యుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రి. సీఎంకి స్వయానా బంధువు. వైఎస్సార్సీపీలో మొదటి నుంచి ఉన్న నాయకుడు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచే వైఎస్ కుటుంబానికి ఆంతరంగికుడు. ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మినబంటు. ఆయనకు కష్టాల్లో తోడున్న ఆత్మ బంధువు. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలికి, కట్టప్పకు మధ్య ఉన్న ఉన్నంత అనుబంధం వీరి సొంతం. ఇలా చెప్పుకుంటూపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకతలు ఎన్నో. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి సీఎం వైఎస్ జగన్ కి త్వరలోనే రాబోతోందా?.
అవును.. ఎందుకంటే..
ఏపీ కేబినెట్ ని అతికొద్ది రోజుల్లో పునర్వ్యవస్థీకరించబోతున్నారు. అందులో భాగంగా బాలినేనికి బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. అంటే మంత్రిగా ఆయన్ని కొనసాగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రకాశం జిల్లా నుంచి ఇతర సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన పరిస్థితి తలెత్తబోతోంది. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 2024 శాసన సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ కి కొత్త రూపు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 12 ఉంటే గత ఎన్నికల్లో అందులో వైఎస్సార్సీపీ ఎనిమిది చోట్ల మాత్రమే నెగ్గింది. 2024లో మరిన్ని సీట్లు సాధించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆయన చెప్పిందే వేదం..: Balineni
బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో కూడా మంత్రిగా చేశారు. దీంతో జిల్లాలోని ఎంపీలకు, ఎమ్మెల్యేలకు బాలినేని మాటే శాసనం అన్నట్లుగా ఉంది. టీడీపీ నుంచి కరణం బలరాం, సిద్ధా రాఘవ రావు వంటి లీడర్లు వైఎస్సార్సీపీలోకి రావటానికి బాలినేనే ప్రధాన కారణమని చెబుతారు. అందువల్ల ఆయన చెప్పినవారికే పోస్టులు వస్తాయని అంటుంటారు. అలాంటి నాయకుడికి ఈసారి కేబినెట్ లో మొండి చేయి చూపాల్సి వస్తుండటం సీఎం వైఎస్ జగన్ కి కొంచెం కష్టమే.
అయినా.. తప్పదు..
ఏపీలో వైఎస్సార్సీపీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తోందనే విషయం విధితమే. దీనికితోడు వైఎస్ బంధువుల డామినేషన్ కూడా ఎక్కువే అని టాక్. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రెండు అంశాలకు అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదని తీర్మానించుకున్నారు. పార్టీపై ప్రజల్లో వస్తున్న రిమార్కులను చెరిపేయాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటివాళ్లకు మంత్రి పదవి కొనసాగింపు సాధ్యం కాదని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.