Ys Jagan : బై ఎలక్షన్స్ బీ రెడీ.. అంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..?
Ys Jagan : ఇటీవలే తిరుపతి ఉపఎన్నిక, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లలో ఘన విజయం సాధించిన అధికార పార్టీ వైఎస్సార్సీపీ మరో సారి బై ఎలక్షన్ కి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరిన నలుగురు శాసన సభ్యుల చేత రాజీనామా చేయించటంతోపాటు విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాని స్పీకర్ చేత ఆమోదింపజేయించటం ద్వారా మినీ సమరానికి సై అంటున్నట్లు అనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీని దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయమని, దాన్ని మళ్లీ లేవకుండా చేయాలనేది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది.
తటపటాయించినా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెడతానంటే కరోనా నేపథ్యంలో వైఎస్సార్సీపీ వద్దు అని చెప్పింది. అయినా అవి జరిగిపోయాయి. మొత్తానికి అవి అధికార పార్టీకి మంచే చేశాయి. ప్రజల్లో తమ బలమేంటో తెలిసొచ్చేలా చేశాయి. పైకి కొవిడ్ అని చెప్పినా లోపల మాత్రం ఎలక్షన్లంటే రూలింగ్ పార్టీ తటపటాయించినట్లు అపొజిషన్ పార్టీ విమర్శించింది. ఎద్దేవా చేసింది. చివరికి నవ్విన నాప చేనే పండింది. దీంతో వైఎస్సార్సీపీలో మునుపటి కన్నా మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికలంటే చాలు రెడీ అంటోంది. టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకున్నారనే అపవాదును చెరిపేయించుకోవటానికి బై ఎలక్షనే బెస్ట్ ఆప్షన్ అని డిసైడ్ అయింది.
ఎవరా నలుగురు?..: Ys Jagan
వల్లభనేని వంశీ(విజయవాడ), మద్దల గిరి(గుంటూరు), కరణం బలరాం(ప్రకాశం), వాసుపల్లి గణేష్ కుమార్(విశాఖ సౌత్) తమ పార్టీ తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీ తరఫునకు వచ్చేశారు. వీరికి తోడు కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కొవిడ్ తో చనిపోయారు. అక్కడ కూడా ఆరు నెలల లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. మరోవైపు నర్సాపురం ఎంపీ రఘురామరాజు రెబల్ గా మారటంతో అతనిపై లోక్ సభ స్పీకర్ చేత అనర్హత వేటు వేయించటం ద్వారా అక్కడ కూడా బైఎలక్షన్ పెట్టాలని ప్లాన్ వేస్తున్నారు. ఈ ఆరు చోట్ల ఉప ఎన్నికలు వస్తే వైఎసార్సీపీకి ఎన్నో విధాలుగా లాభం కలుగుతుంది. ముఖ్యంగా టీడీపీ చేస్తున్న పనికి మాలిన విమర్శలకు మరోసారి చెక్ పెట్టొచ్చు. రాష్ట్ర రాజకీయాలపై తన పట్టును మరింత నిలబెట్టుకోవచ్చు.