Kantara Movie Review : కాంతారా మూవీ రివ్యూ.. కుదోస్ టు రిషభ్ శెట్టి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kantara Movie Review : కాంతారా మూవీ రివ్యూ.. కుదోస్ టు రిషభ్ శెట్టి

 Authored By prabhas | The Telugu News | Updated on :15 October 2022,4:30 pm

Kantara Movie Review : కన్నడ చిత్రం కాంతారా గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది.ఈ క్రమంలోనే సినిమాను అన్ని భాషల్లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. తెలుగులో ఈ చిత్రాన్ని నేడు డబ్ చేసి వదిలారు. మరి ఈ చిత్రం తెలుగు వారికి ఎంత నచ్చింది..హీరోగా, దర్శకుడిగా రిషభ్ శెట్టి నటన ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథ : కాంతార కథ చాలా లోతుగా ఉంటుంది. పైపైన చెప్పుకుంటే మాత్రం ఇది చాలా చిన్న కథ. ఓ గ్రామం.. అందులోని దైవం. ఓ రాజు ఆ దైవాన్ని చూసిన వెంటనే మనశ్శాంతి చెందుతాడు. ఆ దైవాన్ని తీసుకునేందుకు వారు అడిగిన భూమిని అంతా కూడా ఇచ్చేస్తాడు.తరువాతి కాలంలో రాజ కుటుంబీకులు ఆ భూమ్మీద కన్నువేస్తారు. మరి ఆ భూమిని, అక్కడి ప్రజలను కాపాడేందుకు క్షేత్రపాలకులు.. కోలం వేసే మనుషులుంటారు. చివరకు రాజ కుటుంబీకుల దేవేంద్ర (అచ్యుత్ కుమార్) ఆశ నెరవేరిందా?

కోలం వేయాల్సిన క్షేత్రపాలక వంశానికి చెందిన శివ (రిషభ్ శెట్టి) ఏం చేశాడు. తన తమ్ముడు గురవను చంపినందుకు శివ ఏం చేశాడు? ఫారెస్ట్ ఆఫీసర్ మురళీ (కిషోర్) పాత్ర ఏంటి? అసలు చివరకు శివకి ఎందుకు దేవుడు పూనాడు? తరువాత ఏం జరిగింది అనేది కథ. నటీనటులు : కంతారా సినిమాలో రిషభ్ శెట్టి అదరగొట్టేస్తాడు. మాస్ జనాలకు మరింతగా ఎక్కేస్తాడు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో దుమ్ములేపేశాడు. సినిమా అంతా ఒకెత్తు అయితే.. క్లైమాక్స్‌లో రిషభ్ నటన ఇంకో ఎత్తు. పతాక సన్నివేశాల్లో రిషభ్ నటన చూసి అందరికీ మెంటలెక్కిపోవాల్సిందే. అలా రిషభ్ తన నటనతో అందరినీ కట్టిపడేస్తాడు. ఆ తరువాత అచ్యుత్ బాగా నటించేశాడు. మురళి పాత్రలో కిషోర్ చివరకు ట్విస్ట్ ఇస్తాడు. సప్తమీ గౌడ అందంగా కనిపించింది. చక్కగా నటించింది. మిగిలిన పాత్రల్లో అందరూ తమ తమ పరిధి మేరకు నటించారు.

Kantara Movie Review and Rating in Telugu

Kantara Movie Review and Rating in Telugu

విశ్లేషణ : రిషభ్ శెట్టి దర్శకుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. పాత కథే అయినా కొత్తగా చెప్పడం రిషభ్ శెట్టి శైలి. కాంతారా కూడా మామూలు రివేంజ్ స్టోరీ టైపే. కానీ దానికి కన్నడ సంప్రాదాయం, కోలం, అటవీ ప్రాంతాన్ని యాడ్ చేయడంతో రేంజ్ మారిపోయింది. అసలే ఇప్పుడు హోంబలే నుంచి వచ్చే చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. కేజీయఫ్ తరువాత కన్నడ ఇండస్ట్రీ స్థాయి పెరిగింది. ప్రస్తుతం కన్నడ పరిశ్రమను మరోసారి తలెత్తుకునేలా చేసింది కాంతారా. కాదు కాదు.. తలెత్తుకునేలా చేశాడు రిషభ్ శెట్టి. నటించడం ఒకెత్తు అయితే ఈ కథనురాసుకోవడం, అంతే పర్ఫెక్ట్‌గా తీయడం మామూలు విషయం కాదు.

ఓ అని రిషభ్ శెట్టి చివర్లో అరుస్తుంటే.. దానికి తగ్గట్టుగా అజనీష్‌ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. కెమెరా పనితనం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు స్లోగా అనిపిస్తాయి. సెకండాఫ్ ప్రారంభం కాస్త నీరసంగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం సినిమాను నిలబెట్టేసింది. ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ చక్కగా కుదిరాయి. క్లైమాక్స్‌లో రిషభ్ నటన చూసి సినిమాలోని జనాలే కాదు.. థియేటర్లోని జనాలు కూడా దండం పెట్టేస్తారు. దేవుడి పూనిన తరువాత రిషభ్ శెట్టి చేసిన నృత్యాలు, యాక్షన్, ఫైట్స్ ఇలా అన్నీ కూడా అందరినీ కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ కోసమే సినిమాను చూసేంత బిగితో కథనాన్ని నడిపించి సక్సెస్ అయ్యారు.

రేటింగ్ 3.5

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది