Most Eligible Bachelor Movie Review : మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ మూవీ రివ్యూ..!
Most Eligible Bachelor.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ : మిస్టర్ మజ్ను మూవీ తర్వాత చాలా రోజులకు అక్కినేని అఖిల్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ అభిమానులకు పలకరించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే అఖిల్‌కు జంటగా నటిస్తుండగా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ దసరా పండుగా రోజు (శుక్రవారం) థియేటర్లలో విడుదల అయ్యింది. అయితే, ఈ మూవీ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో రాగా, ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్-2 బ్యానర్ పై నిర్మించారు. కాగా, ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
స్టోరీ : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో అక్కినేని అఖిల్ ‘హర్ష’ పాత్రలో కనిపిస్తాడు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జాబ్ చేస్తుంటాడు. అయితే, తన ఆలోచనలకు తగిన విధంగా ఉండే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని భారత్‌కు వస్తాడు. ఈ క్రమంలో అఖిల్‌కు చాలా పెళ్లిచూపులు అవుతాయి. కానీ, ఏ ఒక్కరూ తన మైండ్ సెట్‌కు తగినట్టుగా దొరకరు. అదే టైంలో ‘విభ’ రోల్ పోషించిన పూజా హెగ్డే.. ఒక స్టాండప్ కమెడియన్‌గా పరిచయమవుతుంది. చూడగానే విభతో ప్రేమలో పడిపోతాడు హర్ష. అయితే కొన్ని కారణాల వలన అఖిల్ మళ్ళీ న్యూయార్క్ సిటీ వెళ్లిపోవాల్సి వస్తుంది. హీరోయిన్‌కు కూడా హర్ష పైన బ్యాడ్ ఒపీనియన్ కలుగుతుంది. అయితే, మరల అఖిల్ పూజను ఎలా పొందగలుగుతాడు? అసలు హర్ష మైండ్ సెట్‌కు తగ్గ అమ్మాయి దొరికిందా లేదా? ఇంతకూ అఖిల్‌కు వివాహం జరుగుతుందా లేదా అన్నది మిగతా కథాంశం..
కలిసొచ్చే అంశాలు : ఈ సినిమాలో అఖిల్, పూజా హెగ్డే యాక్టింగ్ చాలా బాగుంది. అదేవిధంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చిన కామెడీ సీన్లు ప్రేక్షక మహాశయులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇంకొకటి ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశం ఎంటంటే మ్యూజిక్.. 3 పాటలు ఎంతో బాగా వచ్చాయి. మెయిన్ యాక్టర్స్ కూడా బాగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా చాలా చక్కగా వచ్చింది.ఈ మూవీలో ఒక సెక్షన్ ఆఫ్ యూత్‌ను మెప్పించే పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. యువతరానికి కావాల్సిన మెసేజ్ ఇచ్చినా.. అందరినీ మెప్పించేందుకు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ గట్టిగానే ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
కలిసిరాని అంశాలు : ఫస్ట్ హాఫ్‌లో కోర్టు సీన్లు అందరినీ నవ్వించినా.. అసలు అర్థంపర్థం లేకుండా ఉంటాయి. పైగా స్టాండప్ కమెడియన్ రోల్‌లో పూజా హెగ్డే నటన పెద్దగా బాలేదు. సెకండ్ హాఫ్ మొత్తం సినిమాకు పెద్ద మైనస్. చివరి అర్ధగంట లెక్చర్ అంశాలు మినహా ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సీన్స్ ఒక్కటి కూడా లేదంటే అర్థం చేసుకోవచ్చు మీరే ఈ మూవీ ఎలా ఉందో..సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఒకానొక సమయంలో అసలు ఇందులో స్టోరీ ఏమైనా ఉందా అన్న అనుమానం కలుగక మానదంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీని ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే దర్శకుడు తీశాడనుకుందామనుకున్నా.. స్టోరీని ప్రజెంట్ చేసే విధానంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పవచ్చు.
మూవీ విశ్లేషణ : సినిమాగా గురించి మొత్తంగా చెప్పాలంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని చెప్పవచ్చు. నేటి తరం యూత్‌కు మాత్రమే ఈ సినిమా నచ్చవచ్చు. కానీ బీ, సీ సెంటర్లలో మాత్రం ఈ సినిమా పెద్దగా ఆడకపోవచ్చు. కామెడీ కోసమే ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో స్టోరీ పెద్దగా లేకపోవడం, చివరి అరగంట అందరికీ చిరాకు తెప్పించడం, సెకండ్ హాఫ్ మొత్తం ఆసక్తి లేకుండా చిత్రీకరణ ఉండటం ఈ మూవీని దెబ్బతీశాయని తెలుస్తోంది. ఇకపోతే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీని ఫస్ట్‌హాఫ్‌లోని కామెడీ, మ్యూజిక్, నటీనటులు మాత్రమే కాపాడాలి.
చివరగా ఈ మూవీ గురించి చెప్పాలంటే : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్తా ‘మోస్ట్ యావరెజ్ బ్యాచిలర్’ అయ్యింది.