Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..
ప్రధానాంశాలు:
Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి బీఆర్ఎస్ లోని ఒక కీలక నేతనే కారణమని కవిత ఆరోపించారు. జగదీష్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే “బీఆర్ఎస్ లిల్లీపుట్” అంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో బీఆర్ఎస్ ను నాశనం చేసిన లిల్లీపుట్ అన్న కవిత, “చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు ఒక్కడే గెలిచాడు” అని వ్యాఖ్యానించారు. తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను బహిర్గతం చేయడం అనుచితమని మండిపడ్డ కవిత, బీఆర్ఎస్ నాయకులే తనపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు.

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్
జగదీష్ రెడ్డిని ‘లిల్లీపుట్’గా సంబోధిస్తూ కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కవిత వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. “నా ఉద్యమ ప్రస్థానంపై కవిత జ్ఞానానికి జోహార్లు” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. కేసీఆర్ శత్రువుల మాటలనే కవిత నోటి వెంట వస్తున్నాయని, ఆమెకు సానుభూతి వ్యక్తం చేస్తున్నానని జగదీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పార్టీలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతోంది.
ఈ మాటల యుద్ధం బీఆర్ఎస్ లో పెరుగుతున్న అసంతృప్తిని, అంతర్గత కుమ్ములాటలను స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా వెలుగొందిన బీఆర్ఎస్, ఇప్పుడు అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.