Magha masam : మాఘమాసం విశేషాలు ఇవే !
Magha masam : మాఘమాసం.. అంటే ముఖ్యంగా అందరికీ గుర్తుకువచ్చేది వివాహాలు, మహాశివరాత్రి, రథసప్తమి. అయితే ఈ మాఘమాసంలో వచ్చే పండుగలు, విశేషాల గురించి తెలుసుకుందాం….
అసలె మాఘమాసంలో ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది. మరో పద్ధతి ప్రకారం మాఘమాసం మహిమ అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది మాఘస్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ, సముద్ర స్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. ఈ ఏడాది మాఘమాసం ఫిబ్రవరి 12 నుంచి మార్చి 13 వరకు ఉంటుంది.
ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి సరస్సులోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం వస్తుంది. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రప్రవచనం.
మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. కుంభమాసం ఈమాసానికి మరో పేరు కుంభమాసం. కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలి. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమివ్వాలి. ఈ మాసంలో అనేక పర్వదినాలు వస్తాయి. వాటిలో ప్రధానంగా వసంతపంచమి, రథసప్తమి, మహాశివరాత్రి అత్యంత ప్రధానమైనవి.