Maghamasam : మాఘసాన్నం చేస్తే కలిగే ఫలితాలు ఇవే !
Maghamasam : మాఘమాసం అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది స్నానం. మాఘస్నానం చాలా పవిత్రమైనది. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలలో ఈ స్నానాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఈ విశేషాలు తెలుసుకుందాం.. మాఘమాసంలో సూర్యుడు ఉన్నమకర రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని వెల్లడించారు.
మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమ రోజు సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.
ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు “దు:ఖ దారిద్ర్యనాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!” అని చేసిన తరువాత “సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!” అని చదవాలి. సూర్య భగవానునికి ఆర్ఘ్యమివ్వాలి. మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగాయమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయసింధులో స్పష్టం చేశారు. అయితే రోజూ సమయాభావం వల్ల, అనారోగ్యం వల్ల చేయలేనివారు మాఘంలో పాడ్యమి, విదియ, తదియ తిథులలో స్నానం చేసి, మళ్లీ త్రయోదశి, చతుర్దశి మాఘ పూర్ణిమ తిథులలో స్నానం చేయవచ్చు.