East godavari.. ఈ పుంగనూరు గిత్తలకు మస్తు డిమాండ్..
వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. కాగా, చాలా మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూనే ఆవులు, గేదెలు పెంచుకుంటూ ఉంటారు. అయితే, ఆవులు, గేదెలతో పాటు ఎద్దులూ వ్యవసాయానికి ముఖ్యం. ప్రస్తుతం యాంత్రీకరణ బాగా పెరగగా, కొంత మంది మాత్రమే ఎద్దులను పెంచుకుంటున్నారు. అయితే, కర్షకులకు గిత్తలు అనగా పొట్టి ఎద్దులు అంటే చాలా ఇష్టముంటుంది. ఈ క్రమంలోనే పుంగనూరు జాతికి చెందిన ఈ కవల గిత్తలకు స్థానికంగా మస్తు డిమాండ్ ఉంది. వాటిని కొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఫార్మర్స్ క్యూ కడుతున్నారు.
ఒక్కో గిత్తకు రూ.లక్ష చొప్పున రెండు గిత్తలకు కలిపి రెండు లక్షలు ఇస్తామని అంటున్నారు. కానీ, యజమాని మాత్రం అమ్మేందుకు సిద్ధంగా లేడు. తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడికి చెందిన రైతు అడబాల నాగేశ్వరరావుకు చెందిన దేశవాళీ ఆవు మొదటి ఈతలో కవల గిత్తలకు జన్మనిచ్చింది. ఈ కవల దూడలను కొనుగోలు చేయడానికి వచ్చిన చాలా మంది రైతులు వాటిని చూసే మురిసిపోతున్నారు. ఈ గిత్తల వీర్యానికి మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.