Conocarpus Tree : ఈ చెట్టు పెంచితే ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే
Conocarpus Tree: సృష్టిలో చెట్లు లేకపోతే జీవి మనుగడలేదు. పచ్చని చెట్లు గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి మన ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అయితే అన్ని రకాల చెట్లు మనకి మంచి చేస్తాయంటే పొరపాటే. మానవాళితోపాటు పర్యావరణానికి కూడా ముప్పుగా పరిగణమిస్తాయి. అలాంటి ప్రమాదకరమైన మొక్కల్లో ఒకటి కోనో కార్పస్ మొక్కలు. ఈ చెట్లు ప్రస్తుతం రోడ్ల పక్కన, డివైడర్ల పైన విరివిగా నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం ఈ మొక్కలను పెంచుతున్నారు. అందం సంగతి పక్కన పెడితే వీటివల్ల జరిగిన నష్టమే ఎక్కువగా ఉంది అంటున్నారు. ఈ చెట్లను దుబాయ్ చెట్లు అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా అమెరికా ఖండంలోని తీర ప్రాంతాలలో పెరుగుతుంది. ఇది వేగంగా పెరుగుతుంది. అలాగే పచ్చగా అందంగా శంకు ఆకారంలో కనిపిస్తుంది.
ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఇళ్లపై దుమ్ము పడకుండా ఉండేందుకు ఈ చెట్లను పెంచుతారు. వేగంగా అందంగా పెరుగుతున్న ఈ మొక్కను నర్సరీ వాళ్ళు ఇతర ల్యాండ్ స్కేప్ ఆర్టిస్టులు ఇండియాకు దిగుమతి చేశారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఆకర్షనీయంగా కనిపించేందుకు మొక్కలను పెంచుకుంటున్నారు. ఆ తర్వాత రోడ్లు అందంగా కనిపిస్తాయని డివైడర్లు ఫుట్ పాతులు పక్కన ఈ చెట్లను నాటుతున్నారు. కోనో కార్పస్ మొక్కలు వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. చెట్ల యొక్క పూల నుండి పుప్పొడి వస్తుంది. ఇది గాలిలో కలవడం వలన మనుషులు పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ మొక్కను నిషేధించాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ మొక్కలు నాటడాన్ని నిషేధించారు. మొదట ఈ మొక్కలను విరివిగా నాటిన ఆ తర్వాత వీటివల్ల జరుగుతున్న నష్టాలను గమనించి నాటడాన్ని నిలిపివేశారు. కోనో కార్పస్ మొక్కల వలన పర్యావరణం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలు అటవీ ప్రాంతంలో పెరగటం వలన గడ్డి జాతి, ఇతర కలుపు మొక్కలు పెరగటం కష్టమవుతుంది. దీని ద్వారా వన్యప్రాణాలకు ఆహారం దొరకదంటున్నారు. వన్యప్రాణుల సంఖ్య తగ్గితే మాంసాహార జంతువులకు కూడా ఆహారం దొరక్క జీవనం కష్టమవుతుంది. ఇది ఇలా ఉంటే కోనో కార్పస్ చెట్ల వల్ల ఇతర చెట్లు వేగంగా పెరగకపోవడంతో పక్షులకు గూళ్ళు ఏర్పాటు చేసుకునే వీలు ఉండదు. దీంతో సరైన ఆవాసం లేక పునరుత్పత్తి జరగదని పక్షుల జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు.