Kadapa..జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారుల ‘పల్లె నిద్ర’ షురూ
జిల్లా ఎస్పీ కె.కె.ఎన్.అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలోని అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ లేదా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ లేదా ఇంకా ఉన్నతస్థాయి పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న విలేజెస్‌లో శనివారం నిద్ర చేయనున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలోని సమస్యల గురించి గ్రామస్తులను అడిగి పోలీసు అధికారులు తెలుసుకోనున్నారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా గ్రామస్తులకు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించాలని, ఏ విషయమైనా పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని, పంచాయితీలు పెట్టుకోవద్దని సూచించారు. గ్రామస్తులు గొడవలకు దూరంగా ఉండాలని, సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుని జీవించాలని పోలీసులు చెప్పారు.
పోలీసు అధికారులు గ్రామాలకు వస్తుండటంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇకపోతే ఈ పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని పరిస్థితులపై పోలీసు అధికారులకు ఓ అంచనా వస్తుంది.