Kadapa..భారీ ధర పలికిన గణేశ్ లడ్డు
గణేశ్ చతుర్థి సంబురాలు ఆల్రెడీ షురూ అయిన సంగతి అందిరికీ విదితమే. దేశవ్యాప్తంగా అనగా గల్లీ నుంచి మొదలుకుని ఢిల్లీ వరకు వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించారు. ఇకపోతే కొందరు రెండు రోజులకే గణేశుడిని నిమజ్జనం చేస్తున్నారు. జిల్లాలోని మైదుకూరు పట్టణంలోని పెద్దమ్మగుడి నిర్వాహకులు గణనాథుడిని ప్రతిష్టించగా, ఇక్కడి విఘ్నరాయుడిని దర్శించుకునేందుకుగాను భక్తులు తరలివచ్చారు. కాగా, స్వామి వారి ప్రసాదమైన లడ్డుకు వేలం పాటలో భారీ ధర లభించిందని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. వేలంపాటలో లడ్డును ధనపాల సందీప్, సారెడ్డి కృష్ణ మోహన్‌రెడ్డి రూ.1,44,444కు దక్కించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఏపీలో వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి విషయమై వివాదం చెలరేగగా, ఏపీ హైకోర్టు తీర్పుతో వినాయక చవితి సంబురాలు ప్రారంభమయ్యాయి. గణేశ్ చతుర్థికి ఆంక్షలు, కొవిడ్ నిబంధనలపై ఏపీలోని అధికార వైసీపీ పార్టీపై విపక్ష టీడీపీ, బీజేపీ నేతలు పలు విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, మంత్రులు కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారమే గణేశ్ చతుర్థి అనుమతులపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు.