Kadapa..సాగుచట్టాల రద్దుపై 12న జిల్లా ప్రెస్ క్లబ్‌లో సదస్సు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న కడప ప్రెస్ క్లబ్‌లో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు అఖిల పక్ష రైతు సంఘాల జిల్లా కార్యదర్శులు దస్తగిరి రెడ్డి, గాలి చంద్ర, రైతు స్వరాజ్య వేదిక జిల్లా కన్వీనర్ మేకల జయన్న, శివారెడ్డి శనివారం తెలిపారు.తొమ్మిది నెలలుగా ఢిల్లీలో రైతన్నలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముగాస్తున్నదని ఆరోపించారు. ఇకపోతే మోడీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డీని విరుస్తున్నదని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు ఇటీవల బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజానీకం నుంచి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 12న నిర్వహించనున్న సదస్సులో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నాయకులు, నిపుణులు వివరించనున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఇప్పటికే విపక్ష పార్టీలు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.