Fish Fry Recipe : చేపల వేపుడు ఇలా చేసారంటే…రుచి అమోఘం…
Fish Fry Recipe : చేపలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మొదలగు విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాని కొందరు చేపలలో ముల్లు ఉంటాయని తినరు. మరికొందరు తినడం రాక తినరు. చేపలను వేపుడు లాగా చేసుకుంటే వాటిలో ఉండే ముల్లులు అంత ఇబ్బంది కలిగించవు. కనుక చేపలను తినడం రాని వారు చేపలను ప్రై చేసుకున్నారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే చేపలకు మంచి మసాలాలు పట్టించి వేపుడు చేసుకొని తిన్నారంటే రుచి ఏంతో అమోఘంగా ఉంటుంది. అలాగే ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. మళ్లీ మళ్లీ చేపల వేపుడు తినాలనిపిస్తుంది. అయితే ఆయిల్ తక్కువగా వాడి, చేపల వేపుడు ఎలా చేసుకోవాలి, దానికి కావలసిన పదార్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం….
కావలసిన పదార్ధాలు : 1) చేపలు 2) నిమ్మరసం 3)కారం 4) ఉప్పు 5)పసుపు 6)ధనియాల పొడి 7) జిలకర్ర పొడి 8) మిరియాల పొడి 9) గరం మసాలా 10) అల్లం, వెల్లుల్లి పేస్ట్ 11) కార్నఫ్లోర్ 12) ఆయిల్ 13) కరివేపాకు తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి అరకిలో చేపలను తీసుకోవాలి. వీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత నీటితో శుభ్రంగా చేప ముక్కలను కడుక్కోవాలి. తరువాత మరొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్ఫూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్ఫూన్ పసుపు, ఒక టీ స్ఫూన్ ధనియాల పొడి, అర స్ఫూన్ జిలకర్ర పొడి, పావు టీ స్ఫూన్ గరం మసాలా పొడి, అర స్ఫూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అరబద్ద నిమ్మరసం వేసుకొని, ఒక స్ఫూన్ కార్న్ ఫ్లోర్ ,1 టేబుల్ స్ఫూన్ ఆయిల్ , కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టేలా పూయాలి. ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలను ఒక గంట సేపు డీప్ ఫ్రీజ్ లో పెట్టుకోవాలి. తరువాత బయటకు తీసి చల్లదనం పోయేవరకు ఉంచాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్ఫన్ల అయిల్ వేసుకొని, నూనె వేడి అయ్యాక ఒక్కొక్కటిగా చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి. తరువాత మిగిలిన ఆయిల్ లో కొన్ని కరివేపాకులను వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకులను తీసి మిగిలిన నూనెను ఫ్రై చేసుకున్న చేప ముక్కలపై పోసుకొని, బాగా కలుపుకోవాలి. అంతే..ఎంతో టేస్టీ టేస్టీ, క్రిస్పీ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ…