KCR : గులాబీ రాజకీయం అయిననూ పోయి రావలె హస్తినకు.!
KCR : రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్ష కూటమి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకి మద్దతిచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. కానీ, బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దామనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుకి ఇదొక ఎదురు దెబ్బ అని అనగలమా.? అంటే, ఔననే చెప్పాలన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదనల సారాంశం. ఇంకెప్పుడు జాతీయ రాజకీయాల్లో కేసీయార్ చక్రం తిప్పుతారు.? త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలూ జరుగుతాయి. లోక్ సభ ఎన్నికలకు పూర్తిగా రెండేళ్ళ సమయం లేదు. అసెంబ్లీ ఎన్నికలకైతే దాదాపు ఏడాది సమయం వుంది. ముందస్తు ఎన్నికలు వస్తేనో.? జమిలి ఎన్నికలు జరిగితేనో.! జాతీయ స్థాయిలో ప్రత్యమ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే, దానికి చాలా సమయం పడుతుంది. అయితే, గడచిన కొన్నేళ్ళుగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు చస్తున్నవి కేవలం పబ్లిసిటీ స్టంట్లు మాత్రమేనన్న విమర్శలున్నాయి. ఆ విమర్శలు తప్పని నిరూపించాలంటే, కేసీయార్ తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సి వుంటుంది.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ లాంటోళ్ళు జాతీయ రాజకీయాలపై ఆసక్తితో వున్నా, వారికి అంతటి బలం వున్నా ఆచి తూచి అడుగేస్తున్నారు. అలాంటి వాళ్ళను కలుపుకుపోవడంలో కేసీయార్ కావొచ్చు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావొచ్చు విఫలమవుతూ వస్తున్నారు. కేసీయార్ తాజాగా ఢిల్లీకి వెళ్ళారు. పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలపై చర్చలు జరుపుతారట. అదే సమయంలో, కొందరు జాతీయ స్థాయి నాయకులతో మూడో ప్రత్యామ్నాయం గురించి మంతనాలు జరుపుతారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి. ఏమో, కేసీయార్ గతంలో చేసిన పర్యటనలు సత్ఫలితాలను ఇవ్వని దరిమిలా, ఈసారైనా ఆయన హస్తిన పర్యటన విజయవంతమవుతుందని అనుుకోలేం.