Telangana Vimochana Dinotsavam : తెలంగాణ విమోచన దినోత్సవం: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.!
Telangana Vimochana Dinotsavam : తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి వచ్చే ఏడాది 17వ తేదీ వరకు వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది బీజేపీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. దేశానికి 1947 ఆగస్ట్ 14వ తేదీన స్వాతంత్ర్యం సిద్ధిస్తే, ఇప్పటి తెలంగాణ ప్రాంతానికి మాత్రం ఆ స్వాతంత్ర్యం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందనేది ఓ వాదన. ఉత్త వాదన కాదు, అదే నిజం. అప్పటిదాకా నిజాం పాలనలో వుంది తెలంగాణ ప్రాంతం. అప్పట్లో ఇది హైద్రాబాద్ సంస్థానం. ఈ హైద్రాబాద్ సంస్థానంలో ప్రస్తుతం కర్నాటక, మహారాష్ట్రలో వున్న కొన్ని జిల్లాలూ వుండేవి. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రతియేడాదీ సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనూ తెలంగాణలో అలా అధికారిక కార్యక్రమాలు జరగలేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా వాటికి ఆస్కారం లేకుండా పోయింది. ‘మేం అధికారంలోకి వస్తే..’ అంటూ తెలంగాణ విమోచన దినోత్సవంపై తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఉద్యమకాలంలో చాలా వాగ్దానాలు చేసినా, అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకోలేదు. ఎలాగైతేనేం, తెలంగాణ విమోచన దినోత్సవానికి తగిన గుర్తింపు లభించబోతోంది. భారతదేశంలో ఒకప్పటి హైద్రాబాద్ స్టేట్ విలీనమై 75 ఏళ్ళు పూర్తవుతున్న దరిమిలా, ఇది ప్రత్యేకమైన సందర్భంగా చెప్పుకోవాల్సి వుంటుంది. స్వతంత్ర భారతావని ఎలాగైతే వజ్రోత్సవాలు జరుపుకుందో.. అలాగే హైద్రాబాద్ స్టేట్‌గా ఒకప్పడు వున్న ప్రాంతం కూడా వజ్రోత్సవాలు జరుపుకోవాల్సిందే.
కాగా, మజ్లిస్ మాత్రం విమోచన దినోత్సవం కాదంటోంది. భారతదేశంలో విలీనమైన రోజుగా దీన్ని భావిస్తోంది. కొందరు విద్రోహ దినోత్సవం అని కూడా అంటుంటారు. పేరు ఏదైతేనేం, అధికారిక గుర్తింపు సెప్టెంబర్ 17వ తేదీకి కావాల్సి వుంది. కానీ, ఆయా పార్టీల రాజకీయ అవసరాలు.. విషయాన్ని వివాదాస్పదం చేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు సెప్టెంబర్ 17వ తేదీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. కాంగ్రెస్ ఈ విషయంలో ఎటూ మాట్లాడలేని పరిస్థితి. మజ్లిస్, టీఆర్ఎస్ కూడా అయోమయంలో పడిపోయాయి.