Arvind Kejriwal : లిక్కర్ పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్ సూత్రధారి.. సీబీఐ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేజ్రీవాల్‌తోపాటు పలువురిపై సీబీఐ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సీఎం జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 25న పొడిగించింది. అయితే ఈ కేసు విచారణ ఆగస్టు 8న జరుగనున్నది. తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తిహార్ జైలులోనే కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జిషీట్ దాఖలు చేయగా, ఇందులో లిక్కర్ పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు అందినట్లు ప్రచారం నడుస్తుంది.
Arvind Kejriwal కేజ్రీవాలే కీలకం..
తాజాగా సమర్పించిన తుది చార్జిషీట్‌లో కేజ్రీవాల్ పాత్రను గురించి వివరించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీలోని తన లిక్కర్ వ్యాపారాలకు అండగా ఉండాలని కోరుతూ 2021 మార్చి 16న సీఎం కేజ్రీవాల్‌ను కలిసినట్లు పేర్కొన్నారు. దానికి అనుగుణంగా లిక్కర్ పాలసీ ఉండేలా చూడాలని కోరారని, దానికి కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరికొందరు అదే పనిలో ఉన్నారని, కవితను కలవాలని సూచించినట్లు చార్జిషీట్ లో స్పష్టం చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు ఫండ్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరినట్లు వివరించింది. ఈ క్రమంలో మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు ఓ సిండికేట్‌గా ఏర్పడి.. మధ్యవర్తులు, హవాలా ఆపరేటర్ ద్వారా రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆప్‌కు అందజేసినట్లు తెలిపింది. ఆ మొత్తాన్ని నిందితులు తిరిగి ‘ప్రాఫిట్ మార్జిన్’ రూపంలో వెనక్కి తీసుకున్నట్లు ఆరోపించింది.
ఎన్నికల ప్రచారం కోసం హవాలా మార్గాల ద్వారా 2021 జూన్ నుంచి 2022 జనవరి వరకు రూ.44.45 కోట్లను గోవాకు బదిలీ చేశారని గత చార్జిషీట్లలో సీబీఐ పేర్కొంది. కొత్త విధానాన్ని 2021 మే 20, 21 తేదీల్లో రూపొందించారని, కోవిడ్ -19 మహమ్మారి పీక్‌లో ఉన్నప్పటికీ దిల్లీ ప్రభుత్వంలోని మంత్రిమండలి 2021 మే 21 న చాలా హడావుడిగా దానిని ప్రాసెస్ చేసి ఆమోదించిందని సీబీఐ ఆరోపించింది.కేజ్రీవాల్‌పై వివిధ రాష్ట్రాల్లో ముప్పై నుంచి నలభై కేసులు ఉన్నాయని, సీబీఐ కేసులో కస్టడీలో కోర్టు చెప్పింది.కాగా.. సీబీఐ అధికారులు తుది చార్జిషీట్‌లో ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్‌పాఠక్, పి.శరత్‌చంద్రారెడ్డి, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ మార్‌లను నిందితులుగా పేర్కొంది. ఇదిలా ఉండగా, ఎక్సైజ్ కుంభకోణానికి కేజ్రీవాలే సూత్రధారని సీబీఐ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సోమవారం వ్యతిరేకించడం మనం చూశాం.