Darja Movie Review : దర్జా మూవీ రివ్యూ.. అనసూయ కోసం దర్జాగా వెళ్లి చూడొచ్చు
Darja Movie Review : సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్,షమ్ము, అరుణ్ వర్మ (సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటించిన చిత్రం దర్జా. ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే రంగమ్మత్తగా, దాక్షాయణిగా మెప్పించిన అనసూయ దర్జాలో ఎలాంటి పర్‌ఫార్మెన్స్ కనబరిచిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
Darja Movie Review : కథ
కనక మహాలక్ష్మి స్థానిక డాన్, ఆమె బంధర్ నగరంలో ప్రతి విషయాన్నీ శాసిస్తుంది ఆమె క్రూరత్వానికి ఆ ఊర్లో బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె గూండాలు తయారు చేసిన చీప్ లిక్కర్ నగరంలో చాలా మంది ప్రాణాలను తీస్తుంది. పోలీసులతో సహా అందరూ ఆమెను చూసి భయపడిపోవడంతో, నేరాలను అదుపులోకి తెచ్చేందుకు ఏసీపీ శివశంకర్ని అదే నగరానికి బదిలీ చేస్తారు. అలాంటి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది మిగతా కథ. కనకం ఆగడాలను ఎదురించే పోలీస్ ఆఫీసర్ రవి (రవి పైడిపాటి) ఎలా బలయ్యాడు? రంగాను ఎవరు చంపారు? కథలో ఇన్స్‌పెక్టర్ రవికి పోలీసు ఆఫీసర్‌కు లింకేమిటి? మాఫియా రాణి కనకం అక్రమ వ్యాపారాలకు దర్జాగా ముగింపు పలికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే దర్జా సినిమా కథ
సినిమా ప్రారంభం నుండే, మనకు కొన్ని సంవత్సరాల నుండి అలవాటైన కొన్ని పాత సన్నివేశాలను చూపిస్తూ అడుగడుగునా మన సహనానికి పరీక్ష పెడ్తూనే వెళ్తుంది. సరైన క్యారెక్టరైజేషన్ లేక ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే సీన్స్ లేక చాలా రొటీన్‌గా ముగుస్తుంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సునీల్ తన వంతు ప్రయత్నం చేసాడు, అనసూయ భరద్వాజ్ పెర్‌ఫార్మెన్స్ చూస్తుంటే ఇలాంటి క్యారెక్టర్స్‌కి బాగా సూటవుతుంది అనిపించేలా ఉంటుంది . మిగతా నటీనటులందరూ ఇచ్చిన పాత్రలకు తగ్గట్టుగా నటించారు.
మధ్య మధ్యలో రంగ(షమ్ము), గీత(అక్సాఖాన్) కామెడీ సీన్స్ నవ్వులు పూయించినప్పటికీ..కథంత నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో సునీల్, అనసూయల మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీసు స్టేషన్‌లో సునీల్‌కు అనసూయ వార్నింగ్, ప్రీక్లైమాక్స్‌లో సునీల్ చేసే ఫైట్ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.
ఈ సినిమాకు ప్రధాన బలం రాప్ రాక్ షకీల్ సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అక్సాఖాన్ స్పెషల్ సాంగ్ తెరపై అదిరిపోయింది. దర్శన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ఎమ్.ఆర్. వర్మ పనితీరు మెచ్చుకోవాల్సిందే. కథలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. ఎలాంటి అడ్డంకులు లేకుండా కథను పరుగులు పెట్టించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయి. అనసూయ కోసం అయిన సినిమాని ఓ సారి చూడొచ్చు.
రేటింగ్ : 2/5