Sircilla Rajeshwari : ఆమె కష్టాలు, కన్నీళ్లు అక్షరాలుగా మారి.. మహారాష్ట్ర బోర్డులో చోటు సంపాదించి పెట్టాయి
Sircilla Rajeshwari : బూర రాజేశ్వరి అంటే చాలా మందికి తెలియదు కానీ.. సిరిసిల్లకు వెళ్లి సిరిసిల్ల రాజేశ్వరి అని అడిగితే చాలు.. అందరి చూపు ఆమె వైపే తిరుగుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? మహారాష్ట్ర బోర్డులో ఆమెకు ఎలా చోటు దక్కింది. ఆమె జీవితం ఏంటి.. తెలుసుకుందాం పదండి..
బూర రాజేశ్వరి.. రెండు చేతులు పనిచేయవు. పుట్టడమే అలా పుట్టింది ఆమె. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు. మామూలుగా ఉన్నవాళ్లకే బోలెడు కష్టాలు. చేతులు సరిగ్గా లేకుంటే ఇంకెన్ని కష్టాలు ఉంటాయో ఊహించుకోవాల్సిందే. అసలే పేద కుటుంబం. తనకు 15 ఏళ్లు వచ్చే వరకు కూడా సరిగ్గా నడవలేకపోయింది రాజేశ్వరి.
ఆసుపత్రుల్లో చూపించడానికి తల్లిదండ్రేలేమీ ఉన్నోళ్లు కాదు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. వాళ్లు కూడా రాజేశ్వరి తలరాత ఇంతే అని వదిలేశారు. కానీ.. తను మాత్రం తన తలరాతను మార్చుకోవాలనుకున్నది. నిరాశకు గురికాలేదు. చేతులు లేకుంటేనేం.. కాళ్లు ఉన్నాయి కదా.. అని కాళ్లతోనే పెన్ను పట్టింది. ఇంటర్మీడియెట్ వరకు చదివింది.
తన మనసుకు నచ్చింది చేయడం ప్రారంభించింది. కాళ్లతోనే కవితలు రాయడం ప్రారంభించింది. కాళ్లతోనే పెయింటింగ్ వేయడం ప్రారంభించింది. అలా.. తను రాసిన కవితల్లో 800 కవితలను మహారాష్ట్ర బోర్డు తమ అకాడెమిక్ కరిక్యులమ్ లో చేర్చింది. అంటే తను రాసిన కవితలు.. ఎంత దూరం వెళ్లాయో చూడండి.
సిరిసిల్ల నేతన్నల కష్టాలనే కవితలుగా..
సిరిసిల్ల అంటేనే మనకు గుర్తుకు వచ్చేది నేతన్నలు. అవును.. వాళ్ల బాధలు ఇప్పటివి కాదు. నేతన్నల కష్టాలను దగ్గర్నుంచి చూసిన రాజేశ్వరి.. వాళ్ల కష్టాలనే కవితలుగా మార్చింది. తనకు ఎంత ఇష్టమైన సాహిత్యాన్ని ఇలా కవితల రూపంలో బయటపెట్టింది.
తన గురించి తెలుసుకున్న రచయిత సుద్దాల అశోక్ తేజ.. సిరిసిల్ల రాజేశ్వరి కవితలు.. అనే పేరుతో తన కవితలను ప్రచురించారు. అలాగే.. తన గురించి మహారాష్ట్ర బోర్డుకు తెలియడంతో.. మహారాష్ట్రలోని అన్ని కాలేజీల్లో రెండో భాష తెలుగు పుస్తకంలో తన కవితలను పాఠంగా చేర్చి విద్యార్థులకు బోధిస్తున్నారు.
తెలంగాణ బోర్డుకు సిఫార్సు చేసిన కేటీఆర్..
అయితే.. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల రాజేశ్వరి కవితలను తెలంగాణ బోర్డు అకాడెమిక్ కరిక్యులమ్ లో కూడా చేర్చాలని.. సిరిసిల్ల రాజేశ్వరి కథను విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు.