Bhuma akhilapriya : భూమా అఖియప్రియ ఎదుట బిగ్ టాస్క్.. పట్టునిలుపుకుంటారా..?
Bhuma akhilapriya : ఏపీ రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, భూమా దంపతుల మరణాంతరం ఆ కుటుంబం నుంచి రాజకీయ వారసురాలిగా భూమా అఖిలప్రియ ఎంట్రీ ఇచ్చారు. నాడు టీడీపీ అధికారంలో ఉండగా ఆమె ఏకగ్రీవంగా శాసనసభకు ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె పొలిటికల్ కెరీర్ రిస్కులో పడింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నియోజకవర్గంలో పట్టునిలుపుకోవడానికి ఆమె ఎదుట పెద్ద టాస్కే ఉంది.
Bhuma akhilapriya : ప్రస్తుతం జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. వైసీపీ లీడర్లు వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు కూడా యాక్టివ్ అయ్యారు. రాబోయే ఎన్నికలు కొందరికి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ముఖ్యంగా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వచ్చే ఎన్నికలు ఒక బిగ్ చాలెంజ్ అనే చెప్పాలి.
భూమా ఫ్యామిలీలో నాగిరెడ్డి, శోభ తర్వాత అంతటి స్థాయిలో ప్రభావితం చేసేవారు ఎవరూ లేరనే చెప్పుకోవాలి. అఖిలప్రియకు పేరెంట్స్ నుంచి ఆ రాజకీయ వారసత్వం వస్తుందని అంతా భావించారు. కానీ, ఆమె నేరుగా ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని చాటలేకపోయారు. ఆమె తొలిసారి ఏకగ్రీవంగా గెలిచింది కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారు.
భూమా అఖిలప్రియ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే తొలుత ఫ్యామిలీ గొడవలను చక్కదిద్దుకోవాలి. అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పుడు వారి కుటుంబంలో విభేదాలు రాగా, ఆమె పెళ్లి తర్వాత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా దూరమయ్యారు. దీంతో భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ నియోజకవర్గంపై పట్టు సడలింది. వచ్చే ఎన్నికల్లో గంగుల కుటుంబాన్ని ఎదుర్కొవాలంటే తిరిగి కుటుంబ సభ్యులకు అఖిల ప్రియ దగ్గర అవ్వాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అఖిలప్రియ ఆళ్లగడ్డలోనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తూ కార్యకర్తలతో మనసు విప్పి మాట్లాడుతున్నారు. భర్తను ఆళ్లగడ్డకు దూరంగా ఉంచి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవసరమైన సమయంలో కార్యకర్తలకు అండగా ఉండి, ఆర్థికసాయం చేస్తున్నారు. మరి ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఈసారైనా పట్టుసాధిస్తారా లేదా అనేది వేచిచూడాల్సిందే.