Ysrcp : వైసీపీకి భయపడే.. అక్కడ పోటీ నుంచి తప్పుకున్నారా..?
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఉమ్మడి ఏపీలో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని నెలకొల్పింది టీడీపీయేనని పొలిట్‌బ్యూరో పేర్కొంది. నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించలేదని టీడీపీ నేతలు గుర్తు చేశారు. బద్వేలు బరి నుంచి తప్పుకోవడంపై స్థానిక నేతలతో చర్చించాలని జిల్లా ముఖ్యనేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
బద్వేలు ఉపఎన్నికల్లో పోటీచేయడం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ తెలిపారు. మరోవైపు బీజేపీ మాత్రం పోటీకి ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే కడప జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని ప్రకటించారు. అలాగే బద్వేలు నియోజకవర్గ పరిధిలో రెండు జాతీయ రహదారులు నిర్మించింది తమ ప్రభుత్వమేనన్నారు. ఐతే జనసేన, టీడీపీల నిర్ణయం నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది ఆసక్తికరంగా మారింది.
Ysrcp గెలుపుకు మల్లగుల్లాలు..
కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ జి. వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆయన సతీమణి డాక్టర్ సుధను వైసీపీ అధిష్టానం అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. త్వరలోనే డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక రెండు రోజుల క్రితం బద్వేలు ఉపఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ముఖ్యనేతలతో చర్చించారు. పార్టీని గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు.
గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రావాలని.. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించాలని.. గతంలో కంటే ఓటింగ్ శాతం పెంచాలని కూడా నేతలకు జగన్ టార్గెట్ విధించారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడం, బీజేపీ ఇంకా స్పష్టతనివ్వకపోవడంతో ఏకగ్రీవమవుతుందనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఈ విషయంలో బీజేపీ పోటీకి దిగుతుందా లేక వైసీపీ నేతలు మాట్లాడి ఏకగ్రీవానికి ఒప్పిస్తారా..? అనేది వేచి చూడాలి.