Amaravati : ‘అమరావతి’పై వైసీపీ సర్కారు సంచలన నిర్ణయం..!
Amaravati : వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ‘అమరావతి’పై సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం పదో తరగతిలో తెలుగు పాఠ్య పుస్తకంలో పన్నెండు పాఠాలను ముంద్రించి, అందులో రెండో పాఠ్యాంశంగా అమరావతిని చేర్చింది. కాగా, తాజాగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రెండో పాఠాన్ని తొలగించి కేవలం పదకొండు పాఠాలతోనే పదోతరగతి తెలుగు పాఠ్య పుస్తకాన్ని ముద్రించింది. సాంస్కృతిక వైభవం కింద గత ప్రభుత్వం రెండో పాఠ్యాంశంగా ముద్రించిన అమరావతి పాఠ్యాంశం తాజా తెలుగు పదో తరగతి పుస్తకాల్లో లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ ఇలా చేసింది. కొత్తగా ముద్రించిన పుస్తకాలను విద్యాశాఖ అధికారులు స్కూల్స్‌కు సరఫరా చేశారు.
కాగా, ఆయా స్కూల్స్‌కు అందిన పుస్తకాలలో గమనిస్తే అందులో కేవలం పదకొండు పాఠాలే ఉన్నాయి. అందులో అమరావతి పాఠం కనిపించడం లేదు. టీచర్స్ విద్యార్థుల నుంచి పాత పుస్తకాలను తీసుకుని కొత్త పుస్తకాలను అందించాలని విద్యాశాఖ సూచించింది. అయితే, ఇప్పటికే ‘అమరావతి’ పాఠాన్ని బోధించినట్లు ఉపాధ్యాయులు చెప్తున్నారు. అమరావతి పాఠంలో అమరావతి పూర్వ చరిత్ర, రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలు ఉండగా, వాటిని కొత్త ముద్రించిన పుస్తకాల్లో తొలగించారు. అమరావతి లెస్సన్‌ను స్కూల్ టెక్స్ట్‌బుక్ నుంచి తొలగించడం పట్ల అమరావతి జేఏసీ నేతలు మండిపడుతున్నారు. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు.
Amaravati : అమరావతి జేఏసీ నేతలు మండిపాటు..
రాజకీయం కోసమే ఇటువంటి చర్యలు తీసకున్నారని విమర్శిస్తున్నారు. జగన్ సర్కారు ప్రజల ఇష్టాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని ఆరోపించారు. అమరావతినే ఏపీకి రాజధానిగా కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఇప్పటికి నిరసనలు చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం అమరావతిని ఏపీకి రాజధానిగా ప్రకటించగా, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలు ఉంటుందని జగన్ ప్రభుత్వం చెప్పింది. రాజ్ భవన్ విశాఖపట్నంలో ఉంటుందని వైసీపీ సర్కారు తెలిపింది. అయితే, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, అమరావతి ప్రాంత రైతులు వ్యతిరేకిస్తున్నారు.