Adilabad.. తెలంగాణ వీరవనిత ఐలమ్మ
పోరాట స్ఫూర్తికి మారుపేరు తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని ఖానాపూర్ శాసన సభ్యురాలు అజ్మీర రేఖ శ్యాం నాయక్ అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేఖ నాయక్ మాట్లాడుతూ ప్రజల్లో తెలంగాణ రైతాంగ విప్లవంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
కొడవలి చేత పట్టి ఐలమ్మ తెలంగాణ ప్రజల్లో నాడు పోరాట స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే ప్రజలు నాడు దొరలకు వ్యతిరేకంగా రైతాంగం, ప్రజలు పోరాటం జరిపి విజయం సాధించారని వివరించారు. ప్రజలంతా నాడు దొరలకు వంగి వంగి దండాలు పెడుతుండగా, చాకలి ఐలమ్మ మాత్రం సివంగిలా గర్జించిందని, జనం చేత బందూకు చేతపట్టించిందని చెప్పారు. వెట్టిచాకిరి నిర్మూలన పోరు జరిపిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, మంత్రులు చాకలి ఐలమ్మ విగ్రహాలు, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.