Business idea : పుట్టగొడుగుల బిజినెస్.. ఇంట్లో హాయిగా కూర్చొని నెలకు 20 వేలు సంపాదిస్తున్న 25 ఏళ్ల యువతి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business idea : పుట్టగొడుగుల బిజినెస్.. ఇంట్లో హాయిగా కూర్చొని నెలకు 20 వేలు సంపాదిస్తున్న 25 ఏళ్ల యువతి

 Authored By jyothi | The Telugu News | Updated on :6 February 2022,4:00 pm

Business idea : పన్నెండేళ్ల క్రితం బబిత కూడా అందరిలా సాధారణ ఆడపిల్లే! కానీ తండ్రి అనారోగ్యంతో ఆమెపై కుటుంబ భారం పడింది. ఆరుగురు తోబుట్టువులు కడుపు నింపడం కోసం కాడిపట్టేలా చేసింది.. కష్టంలోనూ వెన్నుచూపకుండా వందల మంది గ్రామస్తుల్లో స్ఫూర్తినింపి ఆడపిల్లల శక్తిని ప్రపంచానికి చాటింది ఉత్తరాఖండ్‌కు చెందిన పాతికేళ్ల బబిత రావత్‌.ఒకవైపు కాలేజీకి వెళ్తూనే స్వయం ఉపాధిలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించింది బబిత. ఎకరం పొలంలో బఠాణీలు, బెండకాయలు, వంకాయలు, కాలీఫ్లవర్‌, సిమ్లామిర్చి వంటివి పండించింది. పుట్టగొడుగుల ఉత్పత్తిలో లాభాలు కురిపించింది. పుట్టగొడుల పెంకం తోనే నెలకు 20,000 సంపాదిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో అందరూ పస్తులున్న వేళ కూడా చుట్టుపక్కల వారికి అండగా నిలిచింది. చుట్టుపక్కల స్త్రీలల్లో ఆమె నింపిన స్ఫూర్తి చిన్నదేం కాదు. ఇవన్నీ గమనించిన రాష్ట్రప్రభుత్వం మహిళా సాధికారత కోసం పాటుపడే వారికి ఇచ్చే తిలూరౌతేలీ అవార్డుతో సత్కరించింది. జిల్లా కలెక్టరు స్వయంగా ఆమె పొలానికే వచ్చి ప్రశంసించింది.”ఉత్తరాఖండ్ రాష్ట్రం, రుద్రప్రయాగ జిల్లా సౌర్ ఉమ్రేలా గ్రామం మాది.

నాన్న పరిస్థితి చూశాక నా చదువే కష్టమనుకున్నా. కానీ అమ్మ చదువు ఆపొద్దని చెప్పింది. పట్టుదలగా పీజీ పూర్తిచేశా. ఎవరిమీదా ఆధారపడకూడదని అందరం కలిసి శ్రమపడ్డాం. ఇప్పటికీ 6-8 గంటలు పొలంలోనే గడుపుతా. ముగ్గురు చెల్లెళ్లకి పెళ్లిళ్లయ్యాయి. మరో చెల్లాయి, తమ్ముడు చదువుకుంటున్నారు. మా పొలంలో పండిన పంటని స్థానికంగానే అమ్మేస్తుంటాం. దీంతో రవాణా ఖర్చులు, సమయం కలిసొస్తున్నాయి.”- బబితఆరుగురు పిల్లలున్న కుటుంబంలో బబితనే పెద్దమ్మాయి. ఆడుతూ పాడుతూ సాగాల్సిన బాల్యం ఆమెది. తండ్రి అనారోగ్యంతో అనుకోని పెద్దరికాన్ని మోయాల్సి వచ్చింది. 12 ఏళ్లక్రితం తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో వాళ్ల కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అప్పటికి బబిత వయసు 13 ఏళ్లే. బంధువులు, స్నేహితుల నుంచి అప్పు తీసుకుని తండ్రికి వైద్యం చేయించింది తల్లి. కానీ అతని పరిస్థితిలో పెద్దగా మార్పేమీ రాలేదు. తినడానికే కష్టంగా ఉండేది. అంత కష్టంలోనూ స్కూల్లో చేర్పించింది తన తల్లి.

women from uttarakand earning lots money with mushroom farming

women from uttarakand earning lots money with mushroom farming

తల్లి కూలి పనులకు వెళ్లేది. రోజుగడవడానికి ఎంత కష్టమవుతోందో బబిత గ్రహించింది. కూలికంటే సొంతంగా వ్యవసాయం చేయడం మంచిదనుకుంది. వాళ్లకి అటుఇటుగా ఓ ఎకరా భూమి ఉంది.కూరగాయలతోపాటు పుట్టగొడుగుల సాగూ ప్రారంభించింది. తన అభివృద్ధిని చూసి చుట్టుపక్కల ఆడవాళ్లూ అదేదో మాకూ నేర్పమన్నారు. వాళ్లకోసం బబిత ప్రత్యేక వర్క్‌షాప్‌లనూ నిర్వహించేది. మెలకువలు నేర్పేది. అలా ఆమె సాయంతో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డ మహిళలెందరో ఆ గ్రామంలో, చుట్టుపక్కల ఊళ్లలోనూ ఉన్నారు. ఒక్కొక్కరూ నెలకి ఎనిమిది నుంచి పది వేల దాకా సంపాదిస్తున్నారు. ఇవన్నీ ఒంటి చేత్తో చేస్తూనే… 5 కి.మీ. దూరంలోని స్కూలుకి కాలినడకన వెళ్లేది బబిత.మహిళలకు ఈమె చేస్తున్న సేవకుగానూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అవార్డులతోపాటు యూత్‌ ఐకాన్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఓపికతో ప్రయత్నిస్తే దేన్నైనా సాధించొచ్చు అనే బబిత ఈతరం అమ్మాయికి స్ఫూర్తిగా నిలుస్తుందడంలో ఎలాంటి సందేహమూ లేదు

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది