Ys Jagan : విశాఖ లో జగన్ ఉక్కు సంకల్పం నెరవేరిందా..? వాట్ నెక్స్ట్
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తు, విశాఖలో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు. కాబోయే ఆర్థిక రాజధాని లో ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని సీఎం జగన్ గట్టి పట్టుదల ప్రదర్శించాడు. ఇందులో భాగంగా అక్కడి వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు కూడా జారీచేశాడని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించకపోతే కఠిన చర్యలు ఉంటాయని జగన్ చెప్పినట్లు మీడియా కథనాల్లో కూడా వచ్చింది.
ఎట్టకేలకు విశాఖ మేయర్ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది. వీఎంసీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి 50 వార్డులు అవసరం కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 గెలుచుకుంది.సంప్రదాయంగా అండగా నిలిచే నగర ఓటరు, విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ అంశం… ఇలాంటి కీలకమైన సానుకూల అంశాలున్నప్పటికీ… విశాఖ మహానగర పాలక సంస్థను టీడీపీ చేజిక్కించుకోలేకపోయింది.
Ys Jagan : టీడీపీ అలా.. వైసీపీ ఇలా
విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. నగరంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో టీడీ పీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ వైసీపీలో చేరిపోయారు. ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గెలిచినప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవ లే మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పా ల్గొంటున్నప్పటికీ… కేడర్ చెదిరిపోయింది. విశాఖ ఎన్నికల్లో సమన్వయ బాధ్యతను పా ర్టీ అధిష్ఠానం ఎవరికీ అప్పగించలేదు. పైగా టీడీపీ తరుపున బలమైన అభ్యర్థులు లేకపోవటం ఆ పార్టీకి బాగా నష్టం కలిగించింది.
ఇదే సమయంలో వైసీపీ పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లినట్లు తెలుస్తుంది. టీడీపీ నిలబెట్టే అభ్యర్థులను గమనించి వాళ్లకు బలమైన పోటీ ఇవ్వగలిగిన వాళ్ళను నిలబెట్టింది వైసీపీ. విశాఖ ఉక్కు ప్రభావం ఉన్నకాని అది వైసీపీ మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడింది. ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డి చేసిన పాదయాత్ర కూడా వైసీపీకి ప్లస్ అయ్యింది. బూత్ దాకా వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఉద్యోగులు, వ్యాపారులు సాహసించలేదు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ అంశం కూడా అనుకున్నంత ప్రభావం చూపలే దు. ప్లాంటు ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు ఎక్కువగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో 17 వార్డులు ఉండగా… తెలుగుదేశం 7, వైసీపీ 7 దక్కించుకున్నాయి. వామపక్షాలకు రెండు, జనసేనకు 1 వచ్చాయి. అంతకుమించి… నగరమంతా విశాఖ ఉక్కు ప్రభావం కనిపించలేదు.
ఇక విశాఖలో మేయర్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. బీసీ జనరల్ కు రిజర్వ్ కావటంతో ఎక్కువగా వంశీకృష్ణ పేరు వినిపిస్తుంది. ఇతను 21 వ వార్డ్ నుండి పోటీచేసి గెలిచాడు. మరోపక్క ఈ ధపా మేయర్ గా మహిళకు అవకాశం ఇవ్వాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అదే కనుక జరిగితే మహిళా నేతకు మేయర్ పదవి ఇచ్చి, వంశీకృష్ణ కు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి .