Health Tips : మహిళలు ఆ సమయంలో కూడా పెరుగు తినొచ్చా..? తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి..?
Health Tips : పెరుగు తింటే చల్వ చేస్తుందని పెద్దలు చెబుతారు. పెరుగు జీర్ణ క్రియను మెరుగు పరుస్తుందని వైద్యులు కూడా అంటారు. అందుకే అన్నం తినే సమయంలో ఆఖరికి కనీసం రెండు మూడు ముద్దలైన పెరుగుతో తినాలని చాలా మంది సూచిస్తారు. వెజ్ అయినా, నాన్- వెజ్ అయినా.. ఆఖర్లో పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ శక్తిమంతంగా పని చేస్తుందని.. అన్నం త్వరగా జీర్ణం కావడానికి ఉపకరిస్తుందని చెబుతారు పెద్దలు. అలాగే పెరుగు తినడం వల్ల శరీరంలోని వేడి తొలగి పోతుందని అంటారు. అందుకే వేసవి కాలం పెరుగుతో చేసిన మజ్జిగ, లస్సీ లాంటివి తాగాలని సూచిస్తారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అందుతాయని చెబుతారు.
అలాగే రుతు క్రమం నడుస్తున్న యువతులు, మహిళలు మాత్రం పెరుగు తినడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతారు మన ఇంట్లో ఉండే పెద్దలు. పీరియడ్స్ సమయంలో పెరుగు తినకూడదని తరచుగా అంటారు. దీనికి శాస్త్రీయమైన కారణం కూడా చెబుతారు. పీరియడ్స్ సమయంలో స్త్రీల శరీరంలో హార్మోన్స మార్పుల వల్ల గర్భాశయం సంకోచం వాపు మొదలైన అనేక సమస్యలు వస్తాయి. ఇటు వంటి పరిస్థితిలో, చల్లని, పుల్లని పదార్థాలు తినకూడదని సలహా ఇస్తుంటారు. పులుపు జలుబును పెంచుతుందని.. దాని వల్ల గర్భంలో నొప్పి ఎక్కువ అవుతుందని అంటారు. అయితే పెరుగు పుల్లని పదార్థం కాబట్టి అది తీసుకుంటే దాని వల్ల నొప్పి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అందుకే పెరుగు తీసుకోవద్దని చెబుతారు.
కానీ.. వైద్య నిపుణుల అభిప్రాయం మాత్రం ఈ పెద్దల మాటలకు విరుద్ధంగా ఉంది. పీరియడ్స్ సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల నొప్పి పెరుగుతుందనేది పూర్తిగా అపోహ మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి అవి వాపును తగ్గించడానికి ఎంతగానో ఉపకరిస్తాయని అంటున్నారు. పీరియడ్స్ సమయంలో పెరుగు తినడం వల్ల కండరాల నొప్పి తిమ్మిరి తగ్గుతుందని వివరిస్తున్నారు. పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుందని చెబుతున్నారు. కాల్షియం ఎముకలను బలోపేతం చేయడంతో పాటు ఆందోళన, డిప్రెషన్ తగ్గిస్తుందని. వివరిస్తున్నారు. అందువల్ల పీరియడ్స్ సమయంలో పెరుగు తినొచ్చని తేల్చి చెబుతున్నారు. కానీ… అది తాజా పెరుగు మాత్రమే అయి ఉండాలని సూచిస్తున్నారు.