Suman : ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారు. కానీ ఆ వ్యక్తి మాత్రం మరీ అంత అతి జాగ్రత్తలకు పోలేదు. పైగా బ్లూ ఫిల్మ్ కేసుల్లో ఇరుక్కొని జైల్లో ఉండి వచ్చిన సుమన్ కి తన మనవరాలినిచ్చి పెళ్లి చేశాడు. తద్వారా ఆ రోజుల్లో అందరూ ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేశారు. సుమన్ కి మళ్లీ మంచి లైఫ్ సొంతమయ్యేలా చూశారు. ఆయన ఎవరో కాదు. తెలుగు చిత్రసీమలో గొప్ప పేరున్న వ్యక్తే. డీవీ నరసరాజు.

ప్రముఖ చిత్రాలకు..
డీవీ నరసరాజు పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా వ్యవహరించారు. గుండమ్మ కథ, రాముడు భీముడు, బడి పంతులు, యమగోల, కారు దిద్దిన కాపురం వంటి ప్రముఖ సినిమాలకు పనిచేశారు. ఇండస్ట్రీలోని రాజకీయాల గురించి బాగా తెలిసిన మనిషి. కాబట్టి సుమన్ ని నమ్మారు. పిలిచి మరీ సంబంధం కలుపుకున్నారు. దీంతో సుమన్ కి అంతటి క్లిష్ట పరిస్థితుల్లో గుడ్ అంటూ కండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. పెద్దాయనే సుమన్ ని మనవడిగా స్వీకరించారంటే అతను మంచివాడే కానీ ఎవరో కావాలనే కటకటాల పాల్జేశారని చిత్ర సీమ అర్థం చేసుకుంది. సుమన్ కి పూర్వ వైభవం రావటానికి ఒకరి తర్వాత ఒకరు సహకరించారు.
హీరో.. జీరో.. హీరో.. : Suman
సుమన్ పూర్తి పేరు సుమన్ తల్వార్. తెలుగువాడు కాకపోయినా నిజమైన హీరో అనదగ్గ అందం. సహజ నటనకు మార్షల్ ఆర్ట్స్ తోడవటంతో తెలుగువాళ్లు సొంత హీరోగా ఆదరించారు. సుమన్ ని టాలీవుడ్ లో టాప్ లెవల్ కి తీసుకెళ్లారు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవితో సమానంగా ఆఫర్లు, స్టార్ ఇమేజ్ అనుభవించాడు. అనుకోని విధంగా నీలి చిత్రాల వ్యవహారంలో చిక్కుకోవటంతో హీరో కాస్తా జీరో అయ్యాడు. బెయిలు కూడా దొరక్కపోవటంతో కొన్నాళ్లపాటు జైల్లోనే ఉండిపోయాడు. బయటికొచ్చాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇండస్ట్రీ సుమన్ ని దూరం పెట్టింది. డబ్బు, పలుకుబడి, పరువు, మర్యాద అన్నీ మంటగలిసి పోయాయి.

దేవుడయ్యారు..
ఆ సమయంలో డీవీ నరసరాజు మనవరాలు శిరీష సుమన్ లైఫ్ లోకి భార్యగా ఎంటరైంది. దీంతో సుమన్ కి అవకాశాలు వరుస కట్టాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా సినిమాలు చేశారు. అయితే అన్నమయ్య మూవీలో వెంకటేశ్వరస్వామి, శ్రీరామదాసు చిత్రంలో రాముడు పాత్రలతో సుమన్ పేరు మరోసారి మారుమోగిపోయింది. దీన్నిబట్టి హీరో సుమన్ తాత గారు డీవీ నరసరాజును కూడా నిజజీవితంలో హీరో అనే చెప్పొచ్చు. ఆయన ధైర్య సాహసాలకు, మంచి మనసుకు, ముందుచూపుకు హ్యాట్సాఫ్ అనొచ్చు.