Corona Warrior : ఆటో డ్రైవరైనా ఎందరినో ఆదుకున్నాడు.. ఇప్పుడాయన కుటుంబానికి దిక్కెవరు..?
Corona Warrior : సాయం చేయాలనే గుణం ఉండాలే గానీ స్థాయితో పనిలేదు. ఆటో డ్రైవరైనా.. ఆదాయం పెద్దగా లేకపోయినా.. పెద్ద మనసు ఉంటే చాలు. దీనికి చక్కని ఉదాహరణే బాణాల మధుసూదనరావు. విజయనగరం టౌన్ లోని పాల్ నగర్ లో ఉండేవాడు. ఆయనకు తల్లి, భార్య, కూతురు ఉన్నారు. ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించేవాడు. నాకు వచ్చేదే తక్కువ.. ఇతరులకు ఇక నేనేం సాయం సాయం చేయగలను అని అనుకోలేదు. ఆపదలో ఉన్నోళ్లను ఆదుకునేందుకు నేనున్నానంటూ ముందుకు వచ్చేవాడు. అత్యవసరం అంటే చాలు క్షణాల్లో వాలిపోయేవాడు. ముఖ్యంగా గర్భిణులను అర్ధ రాత్రయినా అప రాత్రైనా ఉచితంగా ఆస్పత్రికి చేర్చేవాడు. బాణాల మధుసూదనరావుది బాల్యం నుంచీ ఇదే మంచి మనస్తత్వం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినవాడు, కష్టాలతో కలిసి పెరిగినవాడు కాబట్టి తనలా పక్కవాళ్లు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. చేతనైన సాయం చేసేవాడు.
ఎంత పని చేశావు స్వామీ..
ఎంతో మందికి కరోనా వైరస్ సోకుతోంది. అందులో ఎక్కువ మంది కోలుకుంటున్నారు. తిరిగి తమ పనులు తాము చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ బాణాల మధుసూదనరావును భగవంతుడు కరుణించలేదు. అంతేలే. దేవుడికి కూడా మంచివాళ్లంటేనే ఇష్టం కదా. వాళ్లనే తొందరగా తీసుకెళుతుంటాడు. ఎప్పుడూ పేదలకు ఏదో విధంగా సేవ చేయాలనే తలంపుతో ఉండే బాణాల మధుసూదనరావుని ఆ దైవం గత నెల 29న శాశ్వతంగా ఈ లోకం నుంచి తన దగ్గరికి తోడ్కొని వెళ్లింది. దీంతో ఆయన కుటుంబం ఇప్పుడు పెద్ద దిక్కు లేక దీనంగా, మౌనంగా రోదిస్తోంది. పరులకు సాయం చేయగా మిగిలిన డబ్బులు కొవిడ్ చికిత్సకు ఎటూ చాల్లేదు. దీంతో బాణాల మధుసూదనరావు భార్య అరుణ రూ.2 లక్షలు అప్పు చేసింది. ఆటో కొన్నప్పుడు తీసుకున్న రుణం కూడా కొంత అలాగే బకాయిపడి ఉంది. వీటికి తోడు మూడు నెలల నుంచి ఇంటి అద్దె కట్టే స్తోమత కూడా లేదు. ఫలితంగా ఆ ఇంటి యజమాని బాణాల మధుసూదనరావు కుటుంబాన్ని బజార్న పడేసేలా ఉన్నాడు.
దేవుడు ఏ రూపంలో వస్తాడో.. : Corona Warrior
పుట్టెడు కష్టాల్లో ఉన్న బాణాల మధుసూదనరావు తల్లి, భార్య, బిడ్డ తమను ఆదుకునేవారికోసం ఆవేదనగా ఎదురుచూస్తున్నారు. వాళ్లను అక్కున చేర్చుకోవటానికి దేవుడు ఎవరి రూపంలో వస్తాడోనని స్థానికులు వేడుకుంటున్నారు. తాను చదువుకోకపోయినా తన కూతురు వాగ్ధేవిని పెద్ద చదువులు చదివించాలని ఎంతో తాపత్రయపడిన బాణాల మధుసూదనరావు కోరిక ఎలా నెరవేరుతుందోనని జాలిపడుతున్నారు. ఏప్రిల్ 29న బాణాల మధుసూదనరావు సోదరుడు సైతం కరోనా బారినపడి కన్నుమూయటం మరింత విషాదకరం. కొవిడ్ సమయంలో బాణాల మధుసూదనరావు చేసిన సామాజిక సేవను గుర్తించిన ఏపీ ప్రభుత్వం కలెక్టర్ చేతుల మీదుగా కరోనా వారియర్ అవార్డును అందజేసింది. అదే చేత్తో వైఎస్ జగనన్న సర్కారు బాణాల మధుసూదనరావు కుటుంబానికి భరోసా ఇవ్వాలని ప్రతిఒక్కరూ ప్రార్థిస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> Miracle : చనిపోయాడని చెప్పి చాప చుట్టేసిన డాక్టర్లు.. తల్లి ఏడుపుతో తిరిగొచ్చిన పిల్లాడి ప్రాణాలు..
ఇది కూడా చదవండి ==> Akkineni Nageswara Rao : అక్కినేని, అన్నపూర్ణమ్మ పెళ్ళి.. మధ్యలో పేకాటకు సంబంధం ఏంటి..?
ఇది కూడా చదవండి ==> Jamun Fruit : షుగర్ ఉన్నవాళ్లు అల్లనేరేడు పండ్లను తింటే ఏమౌతుంది..? నిపుణులు ఏమంటున్నారు?
ఇది కూడా చదవండి ==> Zodiac Sign : మీ రాశి ప్రకారం మీరు ఏ జ్యోతిర్లింగం పూజించాలో మీకు తెలుసా ?