Palm Tree Climbing Girl : తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తున్న బాలిక.. ఆశ్చర్యపోతున్న స్థానికులు.. ఎక్కడో తెలుసా?
Palm Tree Climbing Girl : తాటిచెట్టు ఎక్కి కల్లు గీయడం అనేది మామూలు విషయం కాదు. చాలా ప్రమాదకరమైన పని అది. అయినా కూడా గౌడ్స్ తమ వృత్తి కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించి రోజూ తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తారు. కల్లును చెట్టు నుంచి కిందికి తీసుకొస్తారు. ఒకరకంగా చెప్పాలంటే చెట్టు ఎక్కి కల్లు తీసుకొని రావడం అనేది సాహసం అనే చెప్పాలి. ఆ పని పెద్దవాళ్లు మాత్రమే చేయగలరు. మగవాళ్లు మాత్రమే చేసే పని. కానీ.. ఓ బాలిక మాత్రం చకచకా తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తోంది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ బాలిక ఎందుకు తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తోంది. కల్లు గీయడం ఆ బాలిక ఎలా నేర్చుకుందో తెలుసుకుందాం రండి.
తమిళనాడులోని విల్లుపురానికి చెందిన తొమ్మిదో తరగతి చదివే బాలిక కరిష్మా చకచకా తాటిచెట్లు ఎక్కేయగలదు. అంతే వేగంగా కల్లును కూడా గీయగలదు. ఓవైపు చదువుతూనే మరోవైపు తన తండ్రికి సాయంగా తాటిచెట్లు ఎక్కుతోంది. తన తండ్రి వృత్తిని గౌరవిస్తూ.. దాన్ని నేర్చుకొని తండ్రికి సాయంత్రం పూట సాయంగా ఉంటోంది.
Palm Tree Climbing Girl : కల్లుగీత కనుమరుగు కాకూడదనే నేర్చుకున్నా
ఈ వృత్తి ఎందరినో ఆదుకుంది. ఎందరికో దారి చూపింది. చాలామందికి ఇదే జీవనాధారం అయింది. అటువంటి ఈ వృత్తి ఇప్పుడు కనుమరుగువుతోంది. ఒకప్పుడు ఈ వృత్తినే చాలామంది వారసత్వంగా ఎంచుకునేవారు. కానీ.. ఇప్పుడు ఈ వృత్తిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందరూ చదువులు, ఉద్యోగాలంటూ పట్నాలకు వెళ్లిపోతున్నారు. నేను కూడా అలాగే చేస్తే మా వృత్తిని అవమానించినట్టే. అందుకే.. మా నాన్న వృత్తిని నేను కొనసాగిస్తా. అందుకే.. కల్లుగీతను నేర్చుకున్నా. మానాన్నకు సాయంగా కల్లు గీస్తున్నా.. అని చెప్పుకొచ్చింది కరిష్మా.
కరిష్మాకు ఒక అక్క కూడా ఉంది. తను కూడా కల్లు గీసేందుకు మొగ్గు చూపుతోందట. తన తండ్రి కూడా తమకు కల్లు గీతనే వారసత్వంగా ఇస్తానని చెప్పడం విశేషం.
నాకు తెలిసిందే కల్లు గీయడం. ఆ వృత్తినే నా పిల్లలను కూడా నేర్పిస్తున్నా. ఇందులో తప్పేముంది. కల్లుగీత కనుమరుగు కాకూడదు. దీని మీద ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. దీన్ని సజీవంగా ఉంచాలంటే.. పిల్లలకు కూడా నేర్పించాలి.. అని కరిష్మా తండ్రి చెప్పుకొచ్చాడు.
అయితే.. అక్కడి స్థానికులు మాత్రం చిన్నపిల్లకు తాటిచెట్టు ఎక్కడం నేర్పించడం ఏంటి.. అంటూ ప్రశ్నిస్తున్నారు. అది ప్రమాదకరమైన వృత్తి. ఆ బాలికకు ఏదైనా అయితే ఎలా.. చదువుకోవాల్సిన వయసులో ఆ బాలికకు ఇవన్నీ నేర్పించడం ఏంటి అంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ బాలిక తాటి కల్లు తీసే విధానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
(Photos Credit : BBC News Telugu)