Biodiesel : చికెన్ వ్యర్థాల నుంచి డీజిల్ తయారీ.. సంచలనం సృష్టించిన కేరళ వ్యక్తి
Biodiesel: దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు లీటర్‌కు రూ.100 మార్కును దాటేశాయి. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన ఓ పశువైద్యుడు అద్భుత ఆవిష్కరణ చేశాడు. కోళ్ల వ్యర్థాల నుంచి బయోడీజిల్‌ను సృష్టించాడు. పైగా సాంప్రదాయ డీజిల్ ధరతో పోల్చితే ఈ డీజిల్ ధర 40 శాతం అగ్గువ. సాంప్రదాయ డీజిల్‌తో జరిగే కాలుష్యంతో పోల్చితే ఈ బయోడీజిల్‌తో జరిగే కాలుష్యం 50 శాతం తక్కువ. అంతేగాక ఒక లీటర్ బయోడీజిల్ 38 కిలోమీటర్ల మైలేజీ కూడా ఇస్తుంది.
మరి ఇంత అద్భుత ఆవిష్కరణ చేసిన ఆ పశువైద్యుడు ఎవరు..? ఈ ఆవిష్కరణ కోసం ఆయన పడిన శ్రమ ఏమిటి..? తన పరిశోధనకు పేటెంట్ హక్కులు పొందడం కోసం ఆయన ఏడేండ్లు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చింది..? తదితర వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఈ కింది వివరాలు చదవాల్సిందే..
Doctorate Research: డాక్టరేట్ కోసం పరిశోధన
కేరళకు చెందిన పశువైద్యుడు జాన్ అబ్రహం కోళ్ల వ్యర్థాల నుంచి బయోడీజిల్‌ను ఉత్పత్తి చేయడానికి ఎంతో శ్రమించారు. కేరళలోని వెటర్నరీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన జాన్ అబ్రహం.. తమిళనాడు వెటర్నరీ & యానిమల్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలోని నమక్కల్ వెటర్నరీ కాలేజీలో 2014కు ముందు డాక్టరేట్ చేశారు. ప్రొఫెసర్ రమేష్ శరవణకుమార్ (మరణించారు) మార్గదర్శకత్వంలో జాన్ అబ్రహం తన పరిశోధనలు జరిపారు. ఆయన పర్యవేక్షణలోనే కోళ్ల వ్యర్థాల నుంచి (పౌల్ట్రీ వ్యర్థాల నుంచి) బయోడీజిల్‌ను సృష్టించే పద్ధతిని కనిపెట్టాడు.
తన పరిశోధన విజయవంతం కావడంతో.. వాయనాడ్‌లోని పూకోడ్ వెటర్నరీ కాలేజీ క్యాంపస్‌లో రూ.18 లక్షల ఖర్చుతో పైలట్ ప్లాంటును ఏర్పాటు చేశాడు. ఈ పైలట్ ప్లాంట్ ఏర్పాటుకు అయిన రూ.18 లక్షలను ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) నుంచి పొందాడు. ఏడాది తర్వాత భారత్ పెట్రోలియంకు చెందిన కొచ్చి రిఫైనరీ జాన్ అబ్రహం ఉత్పత్తి చేస్తున్న బయోడీజిల్‌కు క్వాలిటీ సర్టిఫికెట్ ఇచ్చింది.
Delay In Patent: పేటెంట్ కోసం ఏడేండ్ల నిరీక్షణ
అయితే, పశువైద్యుడు జాన్ అబ్రహం తన పరిశోధనకు పేటెంట్ హక్కులు పొందటానికి ఏడు సంవత్సరాలు నిరీక్షించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ఇంధన ఉత్పత్తికి ఉపయోగిస్తున్నది జీవ సంబంధమైన ముడిపదార్థం. కాబట్టి ఆయన ఉత్పత్తికి పేటెంట్ హక్కులు రావాలంటే జాతీయ జీవ వైవిధ్య అథారిటీ అనుమతి అవసరం. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ అనుమతి పొంది పేటెంట్ హక్కులు పొందే సరికి ఆయనకు ఏడేండ్లు పట్టింది. చివరికి 2021, జూలై 7 న జాన్ అబ్రహం తాను ఉత్పత్తి చేసిన బయోడీజిల్‌కు పేటెంట్ హక్కులు పొందారు.
Less Polluting: సమర్థత ఎక్కువ, కాలుష్యం తక్కువ
సాంప్రదాయ డీజిల్‌తో పోల్చితే జాన్ అబ్రహం కనిపెట్టిన బయోడీజిల్ సమర్థత చాలా ఎక్కువ. కాలుష్యం చాలా తక్కువ. సాంప్రదాయ డీజిల్లో సీటేన్ కంటెంట్‌తో పోల్చితే.. ఈ బయోడీజిల్లో సీటేన్ కంటెంట్ ఎక్కువగా ఉండటమే కారణం. సాంప్రదాయ డీజిల్లో సీటేన్ 64 శాతం ఉంటే.. బయోడీజిల్‌లో సీటేన్ 72 శాతం ఉంటుంది. కాగా, జాన్ అబ్రహం పర్యవేక్షణలో ఇప్పుడు ముగ్గురు విద్యార్థులు పంది వ్యర్థాల నుంచి బయోడీజిల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.