Inspirational : కష్టాలను అధిగమించే వ్యక్తుల కథలు చాలా మందిలో స్ఫూర్తిని రగిలిస్తాయి. వారు పడిన కష్టాలు.. వారికి భవిష్యత్తుపై ఉన్న విశ్వాసం, నమ్మకం ఎలా లక్ష్యాన్ని చేధించడంలో ఉపయోగపడ్డాయో తెలుసుకుంటూ ఉన్నప్పుడూ ఏదో తెలియని ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అపజయాలను విజయాలుగా మలుచుకున్న తీరు మన రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. అటువంటి అద్భుతమైన కథ IAS అధికారి విజయ్ కులంగేది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని రాలెగాన్ అనే చిన్న గ్రామంలో టైలర్ గా పని చేసే తండ్రి మరియు పొలాల్లో రోజువారీ కూలీగా పని చేసే తల్లికి జన్మించాడు విజయ్. చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు రోజంతా పడే కష్టాన్ని చూస్తూ పెరిగాడు విజయ్. రోజుకు కేవలం రూ. 200 సంపాదిస్తున్న అతని తల్లిదండ్రులు తమ పిల్లలకు రోజుకు రెండు పూటలా భోజనం అందించడానికే పడే కష్టాన్ని కళ్లారా చూసి చలించి పోయేవాడు. డబ్బుకు ఎప్పుడూ కటకటలాడే పరిస్థితే. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిని ఎన్నో సార్లు చూశాడు.
తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని తగ్గించి.. వారు గర్వపడేలా చేయాలని చిన్నప్పటి నుండే అనుకుంటూ ఉండే వాడు విజయ్. చిన్నప్పటి నుండి విద్య యొక్క ప్రాముఖ్యతను మరియు అది మన జీవితాలను ఎలా మంచిగా మార్చగలదో తన తల్లిదండ్రులు నేర్పించారని చెబుతాడు విజయ్. తనకు తన సోదరికి చిన్నప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు లేకపోయినా.. స్కూల్ వెళ్లేందుకు సరిపడ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఎప్పుడూ తగినన్ని ఉండేవని అంటాడు విజయ్.విజయ్ చిన్నప్పటి నుండి స్కూల్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే వాడు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కనేవాడు. కానీ, ఎంబీబీఎస్ సీటు వచ్చినా ఆర్థిక పరిస్థితుల కారణంగా తన కలను వదులుకోవాల్సి వచ్చింది. త్వరగా ఉద్యోగం వచ్చేలా డిప్లొమా ఇన్ ఎడ్యూకేషన్ (D.Ed) చదివి సమీపంలోని నెవాసా తాలూకాలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయునిగా చేరాడు. కానీ విజయ్ తటితో ఆగిపోవాలని ఎప్పుడూ భావించలేదు. ఇంకా ఉన్నతమైనది సాధించాలని ఎప్పుడూ అనుకునే వాడు.

విజయ్ మదిలో ఉన్న ఆలోచనను గమనించిన అతని తండ్రి రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్షకు సిద్ధం కావాలని అతనిని ప్రోత్సహించాడు. తన మొదటి రెండు ప్రయత్నాలలో విఫలమైన విజయ్.. ఆఖరి ప్రయత్నంగా తన ఉద్యోగాన్ని వదిలి పరీక్షకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాడు. మూడో ప్రయత్నంలో MPSC పరీక్షలో విజయం సాధించి, అహ్మద్‌నగర్‌లో సేల్స్ టాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందాడు. మరుసటి సంవత్సరం, అతను తహసీల్దార్ పదవికి కూడా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ పరీక్షలలో ప్రతి విజయంతో తన ఆత్మవిశ్వాసం పెరుగుతూ వచ్చిందని అంటాడు విజయ్. ఇదే ఉత్సాహంతో UPSC సివిల్ సర్వీస్ పరీక్షకు సన్నద్ధం కావాలని నిర్ణయించుకున్నాడు.
ఇంగ్లీష్ కష్టం కావడంతో మరాఠీలో పరీక్ష రాయాలని అనుకున్నాడు. 2012లో యూపీఎస్సీ సీఎస్‌ఈలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారి హోదా సాధించాడు.తన విజయానికి తన నాన్న చెప్పిన మాటలు.. అలాగే.. తనకు అప్పటికే ఉన్న ఉద్యోగం తన భయాన్ని పోగొట్టాయని, విశ్వాసంగా పరీక్షకు సన్నద్దం అయ్యేలా చేశాయని అంటాడు విజయ్. ఐఏఎస్ అధికారిగా విజయ్ మొదటి పోస్టింగ్ ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో జరిగింది. అప్పుడే విజయ్ ‘ఆజ్చా దివాస్ మజా’ అనే మరాఠీ పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో తన కష్టాలు, ప్రయాణం మరియు తన తల్లిదండ్రులు చేసిన త్యాగాలను వివరించాడు.