మానవత్వం పరిమళించిన మణికంఠకు.. మహమ్మారి రాసిన మరణ శాసనం..!
Corona : ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కిందికి వచ్చే బొమ్మూరుకు చెందిన మల్లిపూడి మణికంఠ అనే యువకుడు మానవత్వానికి మారుపేరుగా నిలిచాడు. భరత్ రాఘవ అనే మరో యువకుడితో కలిసి 300లకు పైగా కరోనా శవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించాడు. నా అనేవారు కొవిడ్ తో చనిపోతే కనీసం చివరి చూపులు చూసేందుకు కూడా నో చెబుతున్న ఈ రోజుల్లో అలాంటి డెడ్ బాడీలకు సైతం అంత్య క్రియలు చేయించాడు. రక్త సంబంధం గానీ మరే అనుబంధం గానీ లేకపోయినా అందరూ నా వాళ్లే అనుకున్నాడు. వాళ్లను తన కుటుంబ సభ్యుడిలా భావించి కాటి కాడి కార్యాలన్నింటినీ తానే దగ్గరుండి జరిపించాడు. తద్వారా ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి నలుగురికీ స్ఫూర్తిగా నిలిచాడు. మనిషి అంటే ఇలా ఉండాలి అని నిరూపించాడు.
కన్ను కుట్టింది..
యమధర్మరాజు కన్నా అధర్మంగా ప్రవర్తిస్తున్న సూక్ష్మజీవి కరోనాకు మణికంఠ చేస్తున్న మానవ సేవను చూసి కన్నుకుట్టింది. కరుణ, దయ, జాలి వంటి గుణాలేవీ లేని, కంటికి కనిపించని ఆ మహమ్మారి చివరికి మణికంఠకు, భరత్ రాఘవకు కూడా సోకింది. దీంతో వాళ్లిద్దరూ వైజాగ్ లోని కేజీ హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ పొందారు. భరత్ రాఘవ కొవిడ్ నుంచి కోలుకున్నాడు కానీ మణికంఠను మాత్రం ఆ హంతకి వదలి పెట్టలేదు. నేను చంపిన వ్యక్తులను నువ్వు సాగనంపుతావా అంటూ వికటాట్టహాసం చేసింది. దీంతో మణికంఠకు విధి చేతిలో ఓటమి తప్పలేదు. ఇవాళ సోమవారం ప్రాణాలు కోల్పోయాడు.
తప్పకుండా వస్తావు కదూ..: Corona
330 కరోనా శవాలకు తన సొంత డబ్బులతో అంతిమ యాత్రలను చేపట్టిన మణికంఠ అదే కరోనా బారిన పడి కన్నుమూయటం చాలా బాధాకరమని అతని స్నేహితుడు భరత్ రాఘవ కన్నీరు మున్నీరవుతూ తెలిపాడు. మిత్రుడు మణికంఠ స్ఫూర్తితో తాను ఇప్పటికీ ఆ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నానని చెప్పాడు. హ్యాట్సాఫ్ మల్లిపూడి మణికంఠ. మళ్లీ ఎప్పుడు పుడతావ్?. మానవత్వము పరిమళించిన నీ లాంటి మంచి మనిషికి ఈ లోకంలోకి స్వాగతం పలికేందుకు మేము వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటాం. తప్పకుండా వస్తావు కదూ.