Karimnagar..కొవిడ్ నియంత్రణపై పోలీసు కళా బృందం అవగాహన
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇక అయిపోయింది అనుకునే లోపు ఈ వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ త్వరలో రాబోతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని అంటున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ రెండు డోసులు కంపల్సరీగా తీసుకోవాలని తెలిపారు.
ఈ అవగాహనా కార్యక్రమంలో షీ టీం ఏఎస్ఐ విజయమణి, కళా బృందం ఇన్‌చార్జి రామంచ తిరుపతి, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. పోలీసులు కొవిడ్ నేపథ్యంలో ఇలా అవగాహన కల్పించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తామని అంటున్నారు. ఇకపోతే కొవిడ్ నివారణకుగాను గతంలోనూ కళాబృందం ఆధ్వర్యంలో పోలీసులు, కళా బృందం సభ్యులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.