Monkeys : నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం…మంచినీటి ట్యాంకులో 30 కోతులు మృత్యువాత… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Monkeys : నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం…మంచినీటి ట్యాంకులో 30 కోతులు మృత్యువాత…

 Authored By ramu | The Telugu News | Updated on :4 April 2024,4:39 pm

Monkeys : నల్గొండ జిల్లాలో అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇటీవల నల్లగొండ జిల్లా నందికొండ పట్టణంలోని తాగునీటి సరఫరా ట్యాంక్ నుండి 30 కోతుల కళేబరాలు బయటకు రావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. అంతేకాకుండా జిల్లా మున్సిపల్ అధికారులు గత మూడు రోజులుగా ఇదే నీటిని ప్రజలకు సరఫరా చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం నల్గొండ వ్యాప్తంగా ఈ న్యూస్ తీవ్ర చర్చనియాంశంగా మారింది. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు అని అధికారులను నిలదీస్తే ఎన్.ఎస్.పి అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నందికొండ మున్సిపాలిటీలో మొదటి వార్డు విజయవిహార్ పక్కనే మంచినీరు సరఫరా చేసే వాటర్ ట్యాంక్ ఉంది. విజయ్ విహార్ వార్డ్ ప్రజలందరికీ కూడా ఈ ట్యాంక్ ద్వారానే త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు.

అయితే గత మూడు రోజులుగా ఆ ట్యాంక్ పై పెద్ద సంఖ్యలో కోతులు అలజడి సృష్టిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని గమనించిన ఆ ప్రాంత నివాసులు బుధవారం రోజు మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి గత మూడు రోజులుగా ట్యాంక్ పై వేల సంఖ్యలో కోతులు గుమ్మి కూడుతున్నాయని ,అలజడి సృష్టిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ప్రజల ఫిర్యాదు మేరకు వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చిన మున్సిపల్ అధికారులు వాటర్ ట్యాంక్ మొత్తాన్ని తనిఖీ చేయగా దానిలో దాదాపు 30 కోతులు పడి మృత్యువాత పడ్డాయి.

దీంతో వెంటనే మున్సిపల్ అధికారులు ట్యాంక్ లోకి దిగి కోతుల కళేబరాలను బయటకు తీశారు. అయితే ప్రస్తుతం వేసవికాలం కావడంతో తీవ్రంగా కొడుతున్న ఎండల కారణంగా కోతులు నీరు తాగేందుకు ట్యాంక్ లోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని మున్సిపల్ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితమే కోతులు మృతి చెందిన గమనించని అధికారులు మాత్రం ఆ నీటినే ప్రజలందరికీ సరఫరా చేస్తున్నారు.

దీంతో మున్సిపల్ అధికారులు ట్యాంకులు సరిగా పరిశీలించకపోవడం , వాటిని శుభ్రం చేయకుండానే ఎక్కువ రోజులు వినియోగించడం వలన దానిలో కోతులు పడిన విషయాన్ని కూడా గుర్తించలేకపోయారని పలువురు మండిపడుతున్నారు. ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నీటిని ఎవరు తాగొద్దని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. ఇక కోతులు పడి మృతి చెందిన ట్యాంకును పూర్తిస్థాయిలో శుభ్రం చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొస్తామని ఎన్ఎస్ పి నాగేశ్వరరావు తెలియజేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది