Jamili Elections : వస్తే ఎన్నికలు.. జమిలిపై రాష్ట్రపతికి కోవింద్‌ కమిటీ నివేదిక..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jamili Elections : వస్తే ఎన్నికలు.. జమిలిపై రాష్ట్రపతికి కోవింద్‌ కమిటీ నివేదిక..!

Jamili Elections : దేశంలో పార్లమెంట్‌ నుంచి పంచాయతీ వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు రూపొందించిన 18,626 పేజీల నివేదకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గురువారం అందజేశారు. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. రెండు దశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఏకకాల ఎన్నికల పునరుద్ధరణ కోసం లోక్‌సభతోపాటే రాష్ట్రాల అసెంబ్లిలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఒకవేళ […]

 Authored By tech | The Telugu News | Updated on :16 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  18,626 పేజీలతో కమిటీ ఏకాభిప్రాయ రిపోర్టు

  •  Jamili Elections : వస్తే ఎన్నికలు.. జమిలిపై రాష్ట్రపతికి కోవింద్‌ కమిటీ నివేదిక..!

Jamili Elections : దేశంలో పార్లమెంట్‌ నుంచి పంచాయతీ వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు రూపొందించిన 18,626 పేజీల నివేదకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గురువారం అందజేశారు. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. రెండు దశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఏకకాల ఎన్నికల పునరుద్ధరణ కోసం లోక్‌సభతోపాటే రాష్ట్రాల అసెంబ్లిలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఒకవేళ ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లభించక హంగ్‌ పరిస్థితులు తలెత్తితే లేదా అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు అనివార్యమైతే కొత్త సభను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం మిగతా కాలానికి ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. లోక్‌సభ, అసెంబ్లి ఎన్నికలు ముగిశాక, వంద రోజుల వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహంచాలని ఈ కమిటీ తన సిఫార్సులలో పేర్కొంది. తొలిసారి జరిగే జమిలి ఎన్నికలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లిల కాల పరిమితి లోక్‌సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని రిపోర్టులో తెలిపారు. జమిలి నిర్వహణపై కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తంచేసిందని, 2029 నుంచే జమిలీ ఎన్నికలు నిర్వ#హంచాలని రిపోర్టులో కోరారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఏకకాలంలో ఎన్నికలు జరిగిన విధానాన్ని కమిటీ ప్రస్తావించింది. ఏకకాల ఎన్నికల వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపింది. ఏటేటా ఎన్నికలు వల్ల ప్రభుత్వం, వ్యాపారాలు, కార్మికులు, కోర్టులు, రాజకీయ పార్టీలు, పౌర సమాజంతోపాటు వివిధ భాగస్వామ్య పక్షాలపై గణనీయమైన భారం పడుతోందని తెలిపింది. ఏకకాల ఎన్నికలతో అభివృద్ధితోపాటు, సామాజిక ఐక్యతకు బాటలు పడతాయని పేర్కొంది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంతోపాటు భారత పౌరుల ఆకాంక్షలను సాకారం చేయడంలో ఈ విధానం దోహదపడుతుందని కోవింద్‌ కమిటీ అభిప్రాయపడింది.

– జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్లానింగ్‌ ఉండాలని, ఎన్నికలకు అవసరమైన ఎక్విప్మెంట్స్‌, సిబ్బంది, భద్రతా బలగాలను మో#హరించాల్సి ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. సింగిల్‌ ఎన్నికల రోల్‌ను ఈసీ తయారు చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్‌సభ, అసెంబ్లి, స్థానిక సంస్థల ఎన్నికలకు చెందిన ఓటరు ఐడీ కార్డులను రూపొందించాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల నిర్వ#హణ ద్వారా పారదర్శకత పెరుగుతుందని కోవింద్‌ ప్యానెల్‌ రిపోర్టులో చెప్పింది. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ ద్వారా భారతీయుల ఆశలు నిజం అవుతాయని పేర్కొన్నారు.
– ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం అమల్లోకి తేవాలంటే ఆర్టికల్‌ 83 (పార్లమెంట్‌ కాలవ్యవధి), ఆర్టికల్‌ 172 (అసెంబ్లిdల గడువు)కి రాజ్యాంగ సవరణ చేపట్టాలి. ఇందుకోసం రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. మున్సిపాలిటీ, పంచాయతీలకు ఏకకాల ఎన్నికల నిర్వహణ కోసం ఆర్టికల్‌ 324ఎని సవరించాలి. అలాగే ఓటర్ల జాబితా, గుర్తింపు కార్డుల కోసం ఆర్టికల్‌ 325లో మార్పులు చేయాల్సి ఉంది. ఇందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తప్పనిసరి.

1) 2029 నుంచి లోక్‌సభ, అసెంబ్లిdలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సరవరణలు చేయాలి
2) పదేపదే మోడల్‌ ప్రవర్తనా నియమావళిని వర్తింపజేస్తున్నందున, ఆర్థిక వృద్ధిపై దాని ప్రతికూల ప్రభావం కారణంగా ఏర్పడే పాలనాపరమైన అంతరాయాలను జమిలి ద్వారా తగ్గించవచ్చు.
3) రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలి. మొదటి దశలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లిdలకు. ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలి.
4) వచ్చే ఐదేళ్లలో శాసనసభల నిబంధనలను మూడు దశల్లో సవరించాలి. హంగ్‌ లేదా అవిశ్వాస తీర్మానం సందర్భాలలో, మిగతా ఐదేళ్ల పదవీకాలానికి తాజాగా ఎన్నికలు నిర్వహించొచ్చు.
5) కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు ఇలా భారత ప్రభుత్వంలోని మూడంచెల ఎన్నికలకు ఓటర్ల హక్కుల్ని కాపాడేందుకు ఒకే ఓటర్ల జాబితా, ఒకే ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు ఉండాలి.

Jamili Elections  191 రోజుల అధ్యయనం

కోవింద్‌ కమిటీ జమిలి ప్రాధాన్యత, నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విసృత అధ్యయనం జరిపింది. గతేడాది సెప్టెంబర్‌ 2న కమిటీ ఏర్పాటైంది. వివిధ రాజకీయ పార్టీలు, నిపుణులతో భేటీలు, సంప్రదింపులు జరిపింది. వివిధ వాటా దారుల అభిప్రాయాలను సేకరించింది. మొత్తంగా 191 రోజులు జమిలిపై కమిటీ పనిచేసింది. ఈ ప్యానల్‌లో హోంమంత్రి అమిత్‌షా, రాజ్యసభలో మాజీ విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌, మాజీ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌.సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే తదితరులు సభ్యులుగా ఉన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ మేఘవాల్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఏకకాల ఎన్నికలను సిఫార్సు చేయడానికి నియమించబడిన ప్యానల్‌ ఇందుకు అనుకూలంగా ఉన్నందున అధ్యయనం పేరిట జరిపే కసరత్తు నామ మాత్రమేనని పేర్కొంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి ప్యానల్‌ నుంచి వైదొలగారు.

Jamili Elections  ఎవరెవరు వ్యతిరేకించారు?

సూచనలు, సలహాలు స్వీకరించే క్రమంలో రామ్‌నాథ్‌ కమిటీ పలువురు నిపుణులను సంప్రదించింది. ఈ సందర్భంలో ముగ్గురు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ జమిలిని తీవ్రంగా వ్యతిరేకించారు. రిటైర్డ్‌ హైకోర్టు సీజేలలో తొమ్మిది మంది స్వాగతించగా, ముగ్గురు విభేదించారు. వ్యతిరేకించిన వారిలో జస్టిస్‌ అజిత్‌ ప్రకాష్‌ షా (ఢిల్లిd-హైకోర్టు), గిరీశ్‌ చంద్ర గుప్తా (కలకత్తా హైకోర్టు), సంజీవ్‌ బెనర్జీ (మద్రాస్‌ హైకోర్టు) ఉన్నారు. వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యక్తీకరణను నిరోధించే ప్రమాదం ఉందని, వక్రీకరించిన ఓటింగ్‌ విధానాలు రాష్ట్రస్థాయి రాజకీయాలను మార్చివేసే ప్రమాదం ఉందని జస్టిస్‌ షా పేర్కొన్నారు. ఏకకాల ఎన్నికలు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుకూలమైనవి కావని జస్టిస్‌ గుప్తా అభిప్రాయపడ్డారు. ఇవి దేశ సమాఖ్య వ్యవస్థని దెబ్బతీస్తాయని జస్టిస్‌ బెనర్జీ పేర్కొన్నారు. అయితే కమిటీతో సమావేశమైన నలుగురు మాజీ భారత ప్రధాన న్యాయమూర్తులు (దీపక్‌ మిశ్రా, రంజన్‌ గొగోయ్‌, ఎస్‌ఏ బొబ్డే, యూయు లలిత్‌) ఈ ఆలోచనకు మద్దతు పలికారు. మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్ల విషయానికొస్తే నలుగురు జమిలికి జై కొట్టారు. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లలో ఏడుగురు ఆమోదముద్ర వేశారు. మార్చి9తో పదవీకాలం ముగిసిన తమిళనాడు ఎన్నికల కమిషనర్‌ పళనికుమార్‌ మాత్రం అభ్యంతరం తెలిపారు. జమిలి సమయంలో స్థానిక అంశాల కంటే జాతీయ అంశాలే విస్తృత ప్రాధాన్యం కలిగివుంటాయని, ఇది ప్రాంతీయ రాజకీయ పార్టీలకు అన్యాయం చేస్తుందన్నది ఆయన వాదన. అలాగే, ఎన్నికల సిబ్బంది కొరత కూడా మరొక తీవ్ర సమస్య అవుతుందని చెప్పారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది