Jaipur Belt: జైపూర్ బెల్ట్ సృష్టికర్త గణేశ్ రామ్ జాంగీర్.. లక్షల మంది వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం..!
Jaipur Belt: వెన్నునొప్పి..! ఈ ప్రపంచంలో ఎన్నో కోట్లమందిని ఈ సమస్య వేధిస్తున్నది. వ్యక్తులపైనా, వివిధ సంస్థల యాజమాన్యాలపైనా, సమాజంపైనా ఈ వెన్నునొప్పి అనేది ప్రధాన ఆరోగ్య భారంగా కొనసాగుతున్నది. ఈ సమస్య పరిశ్రమల్లో పనిచేసే కార్మికులపైనా, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కూలీలపైనా, వ్యవసాయ కూలీలపైనా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్లలో ఈ వెన్నునొప్పి అనేది సర్వసాధారణమైనదిగా మారిపోయింది.
వాస్తవం చెప్పాలంటే ఈ మధ్య జరిగిన ఓ అధ్యయనంలో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల్లో 60 శాతం మందికిపైగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని తేలింది. ఇక రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లాలోని న్యూండ్రా గ్రామంలో కూడా స్థానికులను వెన్నునొప్పి సమస్య వేధిస్తున్నది. ఆ గ్రామస్తులు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పనులు చేస్తుంటారు.
అదే గ్రామానికి చెందిన 18 ఏండ్ల గణేశ్ రామ్ జాంగీర్ కూడా తాను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి స్కూల్ అయిపోగానే కుటుంబసభ్యులతో కలిసి సజ్జ చేనులో పని చేసేవాడు. అప్పుడు అతనికి వెన్నులో తీవ్రమైన నొప్పి వచ్చేది. తనతోపాటు తన తల్లిదండ్రులు కూడా ఆ బాధను అనుభవించడం చూశాడు. అంతేకాదు, ఆ గ్రామంలో చాలామంది చేను పనుల కారణంగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని తెలుసుకున్నాడు.
Jaipur Belt: పెయిన్ కిల్లర్స్‌తోనే సరి..
ఈ విషయమై గణేశ్ రామ్ జాంగీర్ తన తల్లిదండ్రులతో చర్చించగా.. తాము గత కొన్నేండ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నామని చెప్పారు. వెన్నునొప్పి భరించలేకుండా వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం లేదంటే రిలీఫ్ కోసం జెండూ బామ్ లాంటి క్రీమ్‌లు రాసుకునేవాళ్లమని తెలిపారు. మరి ఆస్పత్రికి వెళ్లొచ్చుగా అని ప్రశ్నించగా.. ఆస్పత్రులకు వెళ్తే తమ వ్యవసాయ పనులు దెబ్బతింటాయని చెప్పారు.
Jaipur Belt: గణేశ్ రామ్ జాంగీర్ మనసులో కొత్త ఆలోచన..
వైద్యులను సంప్రదిస్తే ఏం చేస్తారు..? ఏం పని చేస్తుంటారని అడుగుతారు. వ్యవసాయం అని చెబితే.. నడుము నొప్పి తగ్గాలంటే కొన్నాళ్లు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలని చెబుతారు. మరి వాళ్లు చెప్పినట్టు చేస్తే బతుకు గడువదు అని గణేశ్ రామ్ తల్లిదండ్రులు చెప్పారు. ఈ సమాధానం గణేశ్ రామ్ జాంగీర్ మనసులో కొత్త ఆలోచనలకు తెరతీసింది. తనకు ఎలాంటి వ్యాపార, పారిశ్రామిక బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఈ వెన్నునొప్పి సమస్యకు శాశ్వాత పరిష్కారం కనుగొనాలని బలంగా నిర్ణయించుకున్నాడు.
Jaipur Belt: ఎనిమిదేండ్ల కృషి తర్వాత జైపూర్ బెల్ట్ ఉత్పత్తి..
వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం కోసం గణేశ్ రామ్ నిర్విరామంగా కృషి చేశాడు. దాదాపు ఎనిమిదేండ్లపాటు అంకితబావంతో పనిచేసిన తర్వాత ఈ సామాజిక పారిశ్రామికవేత్త 2016లో న్యూండ్రా ఇన్నోవేషన్స్‌ను ప్రారంభించాడు. తన సంస్థ ద్వారా జైపూర్ బెల్ట్ అనే ప్రోడక్ట్‌ను ఉత్పత్తి చేసి మార్కెట్‌లోకి విడుదల చేశానని చెప్పాడు. విద్యుత్ అవసరంలేని ఈ తేలికైన జైపూర్ బెల్ట్ బాధితులకు బాహ్య అస్థిపంజరంలా పనిచేస్తుందన్నాడు. ఈ జైపూర్ బెల్టు వినియోగం ద్వారా వెన్నుపై 50 శాతం భారం తగ్గుతుందని తెలిపాడు.
Jaipur Belt: జైపూర్ బెల్టుకు దేశవిదేశాల్లో ఫుల్ డిమాండ్..
కాగా, గణేశ్ రామ్ జాంగీర్ ఉత్పత్తి చేసిన ఈ జైపూర్ బెల్టుకు 2019లో తొమ్మిది దేశాల్లో పేటెంట్ హక్కులు లభించాయి. ఆయా దేశాల మార్కెట్‌లలో ఇప్పుడు వాటికి మంచి డిమాండ్ కూడా ఉన్నది. తాజాగా ఈ జైపూర్ బెల్టులను తమ కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు. త్వరలోనే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు, దుకాణాలు, ఇంకా ఇతర మార్గాల ద్వారా కూడా ఈ బెల్టులను విక్రయించేందుకు ప్లానింగ్ చేస్తున్నారు.