Online Delivery | ఆన్‌లైన్ డెలివరీ స్కామ్ షాక్ ..రూ.1.86 లక్షల ఫోన్ స్థానంలో టైల్ ముక్క!
Online Delivery | బెంగళూరులో మరోసారి ఆన్‌లైన్ డెలివరీ మోసం సంచలనంగా మారింది. యలచెనహళ్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ.1.86 లక్షలు ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ స్థానంలో టైల్ ముక్క అందుకోవడం షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే 43 ఏళ్ల టెకీ ఇటీవల అమెజాన్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 మోడల్‌ను ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 14న రూ.1.86 లక్షలు చెల్లించి ప్రీ-పెయిడ్ ఆర్డర్ చేసిన ఆయనకు అక్టోబర్ 19న పార్సిల్ డెలివరీ అయ్యింది.
మోసపోయాడుగా..
ఖరీదైన వస్తువు కావడంతో అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు కస్టమర్ అన్‌బాక్సింగ్ వీడియో రికార్డ్ చేశాడు. అయితే, బాక్స్ తెరిచే సరికి ఫోన్ బదులు ఒక తెల్లటి టైల్ ముక్క కనిపించింది! దీంతో షాక్‌కు గురైన కస్టమర్ వెంటనే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) లో ఫిర్యాదు చేశాడు. అనంతరం కుమార్ స్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు నమోదు చేశారు.
పోలీసులు ఐటీ చట్టంతో పాటు IPC సెక్షన్ 318(4), 319 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డెలివరీ ప్రక్రియలో ఎక్కడ మోసం జరిగిందనే అంశంపై క్లూస్ టీం, సైబర్ టీం సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది. పార్సిల్ హ్యాండ్లింగ్‌లో పాల్గొన్న డెలివరీ సంస్థ, అవుట్‌సోర్సింగ్ పార్ట్‌నర్, గోదాం సిబ్బంది పై పోలీసులు దృష్టి సారించారు.