Tribals : బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసిన ట్రైబల్స్ ని ఎందుకు గుర్తించలేదు..?
Tribals : బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోరుతూ మనదేశంలో వివిధ మార్గాల్లో పోరాటాలు జరిగాయి. అనేక వర్గాలకు చెందిన వారు అందులో పాల్గొన్నారు. ఈ ఉద్యమాలు వివిధ దశల్లో, వివిధ రూపాల్లో సాగాయి. ఇందులో సామాన్యులు, ఆదివాసులు సైతం అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే ఈ పోరాటంలో కొన్ని తరగతులకు చెందిన ఉద్యమాలకు గుర్తింపు లభించలేదనే చెప్పాలి. వాటిలో కొన్నింటికి ఇటీవల ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. లో భాగంగా ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలోని వివిధ గిరిజన తెగలు కూడా బ్రిటిష్ వారిపై తిరుగుబాట్లు చేశాయి. అందులో చెంచులకు చెందిన పోరాటాలకు ఇటీవల అధికారిక గుర్తింపు దక్కింది. నల్లమల అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ సైన్యాలను ఎదురించిన ఇద్దరు చెంచు జాతి గిరిజన వీరుల విగ్రహాలను తాజాగా ఏర్పాటు చేసి వారిని స్మరించుకున్నారు. దీంతో చెంచులకు లభించిన గుర్తింపుగా కొందరు భావిస్తున్నారు.
Tribals : ఆ ఇద్దరి విగ్రహాల ఆవిష్కరణ
చెంచుల హక్కుల కోసం, అటవీ సంపద కోసం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన నాయకుడిగా ఐటీడీఏ ప్రస్తావించిన ఇద్దరు స్వంతంత్య్ర పోరాట యోధుల్లో ఒకరు కుడుముల పెద్ద బయన్న. రెండో వ్యక్తి హనుమంతప్ప. పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్డులో ఉన్న తుమ్మబయలు గ్రామంలో ఈ ఇద్దరి విగ్రహాలను ఐటీడీఏ ఏర్పాటు చేసింది. ఇటీవల ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మునిసిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ విగ్రహాలను ఆవిష్కరించారు.
Tribals : పెద్ద బయన్న ఎదురు తిరిగి..
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న పెద్ద దోర్నాల మండలం పెద్ద చేమ గ్రామానికి చెందిన పెద్ద బయన్నను, పెద్ద బయలోడు అని స్థానికంగా పిలిచేవారు. అటవీ సంపదపై పన్నులు, పులి, జింక చర్మాలతో పాటు అటవీ ఉత్పత్తుల సేకరణపై అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వాటిని చాలాకాలం పాటు భరిస్తూ వచ్చిన చెంచులను సమీకరించి బయలోడు ఎదురుతిరిగారు. తుమ్మలబైలు గ్రామాన్ని స్థావరంగా చేసుకుని తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో బ్రిటిష్ జెండాను ఎగురవేయాలని ఆదేశించిన ఉత్తర్వులను ఉల్లంఘించిన బయలోడు, చెంచులతో కలిసి విల్లంబుల సాయంతో బ్రిటిష్ పాలకులను ఎదుర్కోవడం మొదలెట్టాడు. సమీపంలోని పిట్టబీతల బొక్క అనే ప్రాంతంలో స్థానికులను దాచిపెట్టి, తాను బ్రిటిష్ వారిని పక్కదారి పట్టించి, పదుల సంఖ్యలో బ్రిటిష్ సైన్యాలను తుదముట్టించడంతో విజయవంతమయ్యారు.
దీంతో ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పట్టించిన వారికి రూ.10వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. అదే సమయంలో పెచ్చెరువు మీదుగా తుమ్మబయలు చేరుకున్న బ్రిటిష్ అధికారులు స్థానిక చెంచులపై కాల్పులకు తెగబడ్డారు. దాంతో తన వారి ప్రాణాలను కాపాడేందుకు తానే ముందుకొచ్చి లొంగిపోయిన పెద్ద బయన్నను చెట్టుకి కట్టేసి 1938 కాల్చి చంపినట్టు ఐటీడీఏ పేర్కొంది.
Tribals : అనుమంతప్ప కూడా ఇదే దారిలో…
పెద్ద బయలోడు పోరాటం సాగిస్తున్న సమయంలోనే కర్నూలు జిల్లా కొత్తపల్లిలో జన్మించిన మరో చెంచు జాతి యువకుడు హనుమంతప్ప కూడా పోరాటానికి దిగారు. ఈయన మెట్రిక్యులేషన్ వరకూ చదువుకున్నారు. బ్రిటిష్ వారి సిబ్బంది స్థానిక చెంచు మహిళల పట్ల వ్యవహరించే తీరుతో ఆయన రగిలిపోయారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు చెంచు పెంటల్లో స్థానికులను సమీకరించి ఆయన గ్రూపులుగా ఏర్పాటు చేశారు. మరోవైపు హనుమంతప్పకు పెద్ద బయన్న పోరాటం కూడా తెలిసి ఆయనతో చేతులు కలిపారు. పెద్ద బయన్న, హనుమంతప్ప ఏకకాలంలో వివిధ చెంచు గూడెంలలో ఉద్యమానికి సిద్ధం కావడంతో వారివురిని బ్రిటిష్ సైన్యం బంధించింది. చివరకు బయన్నతో పాటుగా హనుమంతప్పను కూడా చెట్టుకి కట్టేసి కాల్చి చంపారని ఏపీ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఐటీడీపీ వెల్లడించింది. చెంచు జాతికి స్వేచ్ఛ కోరుతూ అసులువు బాసిన ఈ ఇరువురు చెంచు యోధులు అందరికీ చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం అని తెలిపింది..
దేశ విముక్తి ఉద్యమంలో పోరాడిన అనేక మందికి తగిన గుర్తింపు దక్కలేదనే వాదన ఉందని, తమ ప్రభుత్వం గిరిజన వీరులకు కూడా గుర్తింపునిస్తోందని ఏపీ ఉప డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. చెంచులను సమీకరించి బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడిన వారి గురించి మా ప్రభుత్వానికి సమాచారం రాగానే స్పందించాం. ఐటీడీఏ నిధులతో విగ్రహాలు ఏర్పాటు చేశాం. వారిచరిత్రకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. తెలుగు నేల నలుమూలలా గిరిజనులు అనేక పోరాటాలు చేశారు. వాటికి తగిన ప్రాధాన్యత దక్కలేదు. అందుకే ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా ఇది చేశాం.. అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేసి గిరిజనుల పోరాటానికి గౌరవాన్నికల్పించాము. చెంచుల సమస్యల మీద కూడా దృష్టి పెట్టి వారి సంక్షేమానికి పాటుపడతాం అని మీడియాకి తెలియజేశారు.