Bandi Sanjay : బండి సంజయ్‌ని తప్పించాక చతికిలపడ్డ బీజేపీ.. క్యాడర్‌కి ఏమైంది?
Bandi Sanjay : అసలు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే.. నిన్నా మొన్నటి వరకు తెలంగాణలో బీజేపీకి వచ్చిన నష్టం ఏం లేదు. పైపెచ్చు బీజేపీ అధికారంలోకి వచ్చేంతగా క్యాడర్ డెవలప్ అయింది. అది కేవలం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వల్లనే సాధ్యం అయిందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టారో అప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకుంది. ఒక్క ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ.. ఆ తర్వాత మరో ఎమ్మెల్యే గెలవడం, తెలంగాణ బీజేపీలోకి ముఖ్య నేతలు రావడం ఇదంతా కేవలం బండి సంజయ్ వల్లే సాధ్యం అయింది.
అసలు తెలంగాణలో నామరూపం లేకుండా పోయిన బీజేపీ పార్టీకి పునర్‌వైభవం తీసుకొచ్చింది బండి సంజయ్ అనే చెప్పుకోవాలి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నంతగా హైప్ క్రియేట్ చేశారు బీజేపీ నేతలు. ఒక్క దుబ్బాక మాత్రమే కాదు.. హుజురాబాద్ లోనూ బీజేపీ గెలవడానికి పరోక్షంగా బండి సంజయ్ కారణమయ్యారు. ఒక్కరుగా ఉన్న ఎమ్మెల్యేలు సంఖ్య పెరగడంతో బీజేపీలో కొత్త ఉత్సాహం వచ్చింది. చివరికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బండి సంజయ్ అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశారు.
Bandi Sanjay : ఇంత చేసినా బండిని ఎందుకు తప్పించినట్టు?
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కోసం ఎంతో చేశారు. అధికార బీఆర్ఎస్ పై ఎక్కు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. బీజేపీలో చేరిన కొందరు నేతలు, అప్పటికే బీజేపీలో ఉన్న సీనియర్లకు బండి ప్రవర్తన నచ్చలేదు. తెలంగాణ బీజేపీలో అందరూ బండి సంజయ్ గురించే మాట్లాడటం వాళ్లకు నచ్చలేదు. దీంతో వెంటనే హైకమాండ్ కు వాళ్లు ఫిర్యాదు చేయడంతో ఎందుకు ఈ గొడవ అనుకున్నారో ఏమో.. బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించి మళ్లీ కిషన్ రెడ్డికే అప్పగించారు. కిషన్ రెడ్డికి ఎప్పుడైతే బాధ్యతలు అప్పగించారో అప్పుడే హైకమాండ్ పప్పులో కాలేసింది. అప్పటి నుంచి బీజేపీలో జోరు, హుషారే లేదు. అసలు క్యాడర్ కూడా చప్పబడిపోయింది. ఎన్నికల వేళ బీజేపీ తన వేలితో తన కంట్లోనే పొడుచుకుందా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాలామంది నేతలు కూడా పార్టీలు మారుతున్నారు. ఇదంతా బండ సంజయ్ ని తప్పించడంతో జరుగుతున్న పరిణామాలే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో?