Amaravati..631వ రోజుకు రాజధాని రైతుల నిరసన దీక్షలు
విభజిత ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళలు నిరసన దీక్ష చేస్తున్నారు. వారి దీక్ష బుధవారానికి 631వ రోజుకు చేరింది. తుళ్లూరు మండలానికి చెందిన గ్రామాల్లో 631 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులు, మహిళలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఆ తర్వాత ఏపీలో ఏర్పడిన జగన్ సర్కారు మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చింది.
పరిపాలనా రాజధానిగా విశాఖ పట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని జగన్ ప్రభుత్వం పేర్కొంది. దాంతో అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ సర్కారు నిర్ణయాలను టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. ఇక ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.