Sankranti Festival : సంక్రాంతి పండుగ ఎప్పుడు, ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న కథ ఏంటి ?
Sankranti Festival : తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతి నే. సంక్రాంతి పండుగ అంటే ఒక సంస్కృతి, ఒక సంబరం, ఒక సాంప్రదాయం. గ్రామీణ సంస్కృతిలో పంటలు చేతికి అందిన సంతోషంలో జరుపుకునే సంబరాలు సంక్రాంతి గా స్థిరపడ్డాయి. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. దాన్ని సక్రమణం లేదా సంక్రాంతి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం పూర్తిచేసుకుని ఉత్తర దిశగా ఈరోజు ప్రయాణం ప్రారంభిస్తాడు. అది ఉత్తరాయన పుణ్యకాలం. సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది.
ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రానికి దగ్గరగా సంచరిస్తాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. పుష్య అంటే పోషించే శక్తి గలదని అర్థం. ప్రజలు పౌశ్యలక్ష్మినీ స్వాగతిస్తూ సంక్రాంతి వైభవంగా జరుపుకుంటారు. రైతులు ఆరు కాలాలు కష్టపడి పండించిన పంట ఇంటికి చేరుకుంటుంది. రైతులకు సహాయపడిన పశువులకు ఇది విశ్రాంతి సమయం. సంక్రాంతి సమయానికి ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు సొంత ఇంటికి చేరుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి పర్వదినాలైన మూడు రోజులు మొదటి రోజు భోగిమంటతో ప్రారంభమవుతుంది. ఇంట్లో పనికిరాని వస్తువులు భోగిమంటల్లో వేస్తారు. దీనివలన అరిష్టం తొలగిపోతుందని నమ్మకం. భోగిమంటతో కాగిన నీళ్లతో అందరూ తలస్నానాలు
చేసి కొత్త బట్టలు ధరించి ఇష్టమైన దైవాన్ని కొలుస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. దీనివలన పిల్లలకు దిష్టి తొలగిపోతుందని నమ్మకం. సంక్రాంతి రోజున ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి చల్లి రంగవల్లులు దిద్ది గొబ్బెమ్మలు పెడతారు. గడపలకు పసుపు కుంకుమలు రాసి గుమ్మాలకు పచ్చని తోరణాలు కడతారు. సంక్రాంతి రోజున గంగిరెద్దుల వారు, బుడబుక్కల వాళ్లు, జంగం వాళ్లు, హరిదాసులు లాంటి వాళ్ళు తమ జానపద కళను ప్రదర్శిస్తారు. కనుమ రోజున కొత్త ధాన్యంతో పొంగలి చేసి దేవుడికి నివేదించి, తమ పంట పొలల్లో చల్లుతారు. పక్షులకు ఆహారంగా ఇంటి ముందు వరి కంకులు కడతారు. ఆ రోజు ఇంటిల్లిపాది సంతోషంలో మునిగి తేలుతారు.