Kadapa..భారత్ బంద్ జయప్రదం చేయండి: వామపక్ష నేతల పిలుపు
కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నదని, ఎల్ఐసీతో పాటు పలు ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఈ క్రమంలోనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేయాలని కోరుతూ ఈ నెల 27న ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో కొనసాగితే ప్రభుత్వ రంగ సంస్థలకు ముప్పు పొంచి ఉంటుందని వివరించారు.
మోడీ నేతృత్వంలోని బీజేపీ వల్ల దేశంలో సామాన్యుడికి ఇబ్బందులే ఎదురవుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగాయని, సామన్యుడి నడ్డీ విరుగుతున్నదని చెప్పారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో జనం ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం ప్రభుత్వం కూడా అలాంటి ఇబ్బందులే క్రియేట్ చేస్తున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్‌పి జిల్లా నేతలు నాగసుబ్బారెడ్డి, చంద్రశేఖర్, సుధీర్ పాల్గొన్నారు.