ప్రేమ మైకంలో పడ్డ యువతికి `దిశ` నిర్ధేశం
కడప: ప్రేమలో పడి చదువును, జీవితాన్ని నిర్లక్ష్యం చేసిందోయువతి. తమ కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించడంతో తాను ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేయాలని పట్టు పట్టి మూడు రోజులు పస్తులుంది. ఈ విషయంపై యువతి ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదులో దిశ డిఎస్పీ కె. రవికుమార్, మహిళా సిబ్బంది వెంటనే స్పందించారు. యువతి ఇంటికి చేరుకుని వారితో ఆత్మీయంగా మాట్లాడి తల్లిదండ్రులకు, యువతికి నచ్చజెప్పి ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేకుండా విరమింప జేశారు.
యువతితో ఈ వయసులో ప్రేమ మాయలో పడి చదువును నిర్లక్ష్యం చేయెద్దన్నారు. చదువుపై శ్రద్ధపెట్టాలని, ఉద్యోగం వచ్చిన తర్వాత తామే చొరవ తీసుకుని పెళ్లి చేస్తామని దిశ పోలీసులు హామీ ఇచ్చారు. బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని జీవితంలో స్థిరపడాలని కౌన్సెలింగ్ ఇవ్వడంతో యువతిలో మార్పు వచ్చింది. తాను ఇప్పుడు పెళ్లి చేసుకోనని, మంచి ఉద్యోగం తెచ్చుకుని జీవితంతో స్థిర పడ్డాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని యువతి పోలీసులుకు చెప్పింది.
తనలో మార్పు తెచ్చి జీవితంపై భరోసా కల్పించినందుకు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, డీఎస్పీ కె. రవికుమార్, మహిళా ఎస్‌ఐ లక్ష్మీదేవి, సిబ్బందికి యువతి ఫోన్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా దిశ వారికి అండగా ఉంటుందని ఏ సవమస్య ఉన్నా 94407 96900 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని డిఎస్పి తెలిపారు.