Guntur.. మట్టి విగ్రహాలే ముద్దు : అంబటి రాంబాబు
మట్టి విగ్రహాలతోనే పర్యావరణానికి మేలు జరుగుతుందని, కావున ప్రతీ ఒక్కరు వాటినే వాడాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లిలో ఆయన మట్టి గణపతుల ప్రతిమలను పలువురికి శుక్రవారం పంపిణీ చేశారు. మట్టితో చేసిన గణనాథులనే ప్రజలు పూజించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసమై ప్రతీ ఒక్కరు మట్టి గణేశుడి ప్రతిమలనే పూజించాలన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని పలు వీధుల్లో ప్రజలు విఘ్నేశ్వర విగ్రహాలను ప్రతిష్టించారు. ఇకపోతే గాంధీ బొమ్మ సెంటర్‌లో ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైన ఉందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యత తీసుకుని పర్యావరణ పరిరక్షణకుగాను తమ వంతు పాటు పడాలని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణేశులను పూజించడం ద్వారా పండుగ ప్రాశస్త్యం నెరవేరడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు.