Khammam.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే: అఖిల పక్ష పార్టీల డిమాండ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి సంపూర్ణంగా వ్యతిరేకమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అఖిల పక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం కేంద్రంలో అఖిల పక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీ కళ్లెం వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
ఈ నెల 27న జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు లాభం చేకూరుస్తూ సామాన్యుడి నడ్డీ విరుస్తున్నదని విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ ప్రజలను ఇంకా ఇబ్బందుల పాలు చేస్తున్నదని ఆరోపించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు ఆర్థికంగా బాగా నష్టపోయారని, ఈ క్రమంలోనే ప్రజలపై కేంద్రం అదనపు భారం వేస్తున్నదని విమర్శించారు.