Khammam..గోదావరిలో నీరు తగ్గుముఖం..
జిల్లాలోని గోదావరి నది ఇటీవల కురిసన వర్షాలకు ఉగ్ర రూపం దాల్చిన సంగతి అందరికీ విదితమే. కాగా, గోదావరి నదిలో నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో 46 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం ఉదయం కల్లా 42 అడుగులకు తగ్గిపోయింది. ఇంకా నీరు తగ్గుముఖం పడుతున్నది. ఇకపోతే నీటిమట్టం తగ్గుముఖం పడుతుండటంతో గోదావరి అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను శనివారం ఉపసంహరించుకున్నారు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకుగాను అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు చర్యలు తీసుకున్నారు.
వాగులు, వంకలు, చెరువులలో నీరు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురి కాగా, అధికారులు, ప్రజా ప్రతినిధులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సేఫ్ ప్లేసెస్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకుగాను రైతులు తమ పంటలను నష్టపోయారు. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలని అన్నదాతలు రాష్ట్రప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంటనష్టం అంచనాలు వేయాలని కోరుతున్నారు.