AP CM Jagan: ఏపీలో సీఎం జగన్ వన్ మ్యాన్ షో.. జట్లు పీక్కుంటున్న స్వపక్ష, విపక్ష నేతలు..!
AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనాపరమైన వ్యవహారాల్లో అన్నీ తానై దూసుకుపోతున్నారు. పరిపాలనా వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలు విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులకు పెద్దగా పని కల్పించకుండా పూర్తిగా వన్ మ్యాన్ షో నడిపిస్తున్నారు. దాంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రే స్వయంగా అన్ని పనులు చేస్తూ పోతే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ప్రజల్లో తమకు గుర్తింపు ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఏపీ సీఎం జగన్ ఈ మధ్య ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏ సంక్షేమ పథకమైనా సరే నేరుగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లలో కేవలం ఒక్క బటన్ నొక్కడం ద్వారా వందల, వేలకోట్ల విలువైన సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. ఇది విపక్ష నేతలతో పాటు స్వపక్ష నేతలకు కూడా మింగుడు పడటంలేదు.
AP CM Jagan: ముఖ్యమంత్రి కాకమునుపే వ్యవస్థలో లోపాలపై అవగాహన..
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకమునుపే వ్యవస్థలో లోపాల గురించి బాగా అవగాహన పెంచుకుని ఉన్న జగన్.. అధికారంలోకి రాగానే ఆ లోపాలపై దృష్టి సారించారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా ప్రజల చేతుల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, జగన్ వన్ మ్యాన్ షో ఆయనకు సంతృప్తికరంగానే అనిపిస్తున్నా.. అధికార పార్టీ నేతలకు తృప్తి లేకుండా చేస్తున్నది.
సంక్షేమ పథకాల గురించి ఎంపీలు, ఎమ్మెల్యేల చేత భారీగా ప్రచారం చేయించి.. ఆ పథకాల అమలుకు సంబంధించిన అధికారాలను స్థానికంగా తమకు కట్టబెడితే బాగుండేదని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. అలా చేయడంవల్ల ప్రజల్లో తమకు కూడా గుర్తింపు లభించేదని, రేపు ఎన్నికల్లో తాము ఈ పనులు చేశామని ప్రజలకు గర్వంగా చెప్పుకునే అవకాశం దక్కేదని వారు చెబుతున్నారు. అయితే, విషయాన్ని నేరుగా జగన్‌కు చెప్పుకోలేక, ఊరుకుండలేక వారు లోలోపలే మదనపడుతున్నారు.
AP CM Jagan: రెబల్స్‌గా తిరగబడుతారనే దూరం..
కానీ, సీఎం జగన్ తీరు చూస్తుంటే మాత్రం.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ప్రజల్లో గుర్తింపు పొందే అవకాశం ఇచ్చే పరిస్థితే కనిపించడంలేదు. అధికార పార్టీ నేతల ఇమేజ్ ఏమాత్రం పెరిగినా రేపు ఎన్నికల సమయంలో టికెట్లు దక్కకపోతే ఎదురుతిరిగే అవకాశం ఉందని, రెబల్స్‌గా పోటీచేసి పార్టీకి తలనొప్పిగా మారవచ్చని జగన్ భావిస్తున్నారు. లేదంటే ప్రత్యర్థి పార్టీల్లో చేరి పార్టీకి నష్టం చేకూర్చవచ్చని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. అందుకే వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వన్ మ్యాన్ షో నడిపిస్తున్నారు.
అందుకే ఏపీలో ఎంపీలు, ఎమ్యెల్యేలకు పెద్దగా పని ఉండటం లేదు. జగన్ పెట్టే వీడియో కాన్ఫరెన్స్ లు సైతం జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ఆన్ లైన్ మీటింగ్స్ కు దగ్గరలో ఉన్న ఎంపీలు, ఎమ్యెల్యేలే హాజరవుతున్నారు. అందులో కూడా ఒక సెకన్ బాగున్నారా అన్నా, అక్కా అంటూ పలుకరించే జగన్ నేరుగా లబ్ది దారులతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. ప్రజాప్రతినిధులు తనతో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదు.
AP CM Jagan: సొంత నెట్‌వర్క్‌పైనే ఆధారం..
జగన్ పరిపాలన పూర్తిగా సొంత నెట్‌వర్క్ ఆధారంగానే జరుగుతున్నది. అందుకే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. ఏ ఊరిలో ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ ఊరి గ్రామ సచివాలయ ఉద్యోగికి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది. అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు దక్కని పరిస్థితి ఎక్కడా ఉండకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. దాంతో అధికారులు ఉరుకులు, పరుగుల మీద అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారు.
ఇలా సీఎం నేరుగా అధికారులతో పనులు చేయిస్తుండటంతో ప్రజాప్రతినిధులకుగానీ, పార్టీ క్యాడర్‌కుగానీ, నేరుగా ప్రజలతో కనెక్షన్ లేకుండా పోయింది. మరోవైపు సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న జగన్.. రోడ్లు, డ్రైనేజీల కోసం పెద్దగా నిధులు ఇవ్వడం లేదని ప్రచారం. దాంతో ప్రజలు ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారట. దాంతో ప్రజలకు లబ్ధి జరిగే దగ్గర తమకు ఏమాత్రం గుర్తింపు లేకపోయినా.. సమస్యల విషయంలో మాత్రం ప్రజలకు తామే టార్గెట్ అవుతున్నామని ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారట.